తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టీమిండియా రసవత్తర పోరు.. పొంచివున్న వరుణుడు

ప్రపంచ కప్​ మనదే... అందరి ధీమా, ఆశ ఇదే. అంచనాలకు తగినట్లే శుభారంభాలు చేసింది భారత్​. అంతే దీటుగా హ్యాట్రిక్​ విజయాలతో ఊపు మీద ఉంది న్యూజిలాండ్​. ఈ రెండు జట్లకు నేడే మ్యాచ్​. విజయం ఎవరిదన్న విశ్లేషణలతోపాటు.... మ్యాచ్​ సమయానికి వరణుడు ఏం చేస్తాడన్న చర్చా జోరుగా సాగుతోంది.

By

Published : Jun 12, 2019, 4:47 PM IST

Updated : Jun 13, 2019, 3:40 AM IST

ఫేవరేట్​ జట్లలో గెలుపెవరిది

భారత్​, న్యూజిలాండ్​ ప్రపంచకప్​ మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

ఫేవరేట్​ జట్లలో గెలుపెవరిది

కివీస్​ హ్యాట్రిక్​ విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్​​, అఫ్గానిస్థాన్​లపై గెలిచింది. ఇప్పుడు భారత్​తో పోరుకు సిద్ధమైంది.

టీమిండియా ఏం తక్కువ కాదు.​ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్​ రేసులో ఉన్న బలమైన జట్టుగా నిరూపించుకుంది. కివీస్​కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

టోర్నీకి ముందు జరిగిన వామప్​ మ్యాచ్​లో భారత్​ను చిత్తు చేసింది కివీస్​. 179 పరుగులకే మనోళ్లు ఆలౌట్. భారత బౌలర్లు ఆ మ్యాచ్​లో తేలిపోయారు. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విలియమ్సన్​ సేన బరిలోకి దిగుతోంది. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా.

3 విజయాలతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్​ రెండు విజయాలతో ఇంగ్లాండ్​తో సమంగా ఉన్నా... నెట్​ రన్​రేట్​ ఆధారంగా మూడో స్థానంలో ఉంది.

రెండు ఫేవరేట్​ జట్లు... భారీ అంచనాలు.... మరి ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయి...?ప్రస్తుత టోర్నీలో అపజయమే ఎరుగని ఇరు జట్లలో ఓటమి ఎవరిని పలకరిస్తుంది..?

న్యూజిలాండ్​

2015 ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేసింది న్యూజిలాండ్​ జట్టు. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలోనూ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. న్యూజిలాండ్​కు బ్యాటింగే బలం అనుకుంటే.. ఇప్పుడు బౌలర్లూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

  • టాప్​ ఆర్డర్​ విషయానికొస్తే ఓపెనర్లు గప్తిల్​, మన్రో చెలరేగి ఆడగలరు. తొలి మ్యాచ్​లో శ్రీలంకపై 137 పరుగుల ఛేదనలో వికెట్లేమీ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. గప్తిల్​ 73, మన్రో 58 పరుగులతో అజేయంగా నిలిచారు. తర్వాతి మ్యాచుల్లోనూ వీరిద్దరూ మోస్తరుగా బ్యాటింగ్​ చేశారు.
  • వన్​డౌన్​లో విలియమ్సన్​, మిడిలార్డర్​లో టేలర్​ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యాలు జట్టుకు విజయాన్ని అందిస్తున్నాయి. బంగ్లాపై టేలర్​ 82, విలియమ్సన్​ 40 పరుగులు సాధించారు. ఆఫ్గానిస్థాన్​పై విలియమ్సన్​ 79, టేలర్​ 48 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాప్​ ఆర్డర్​ ప్రదర్శనతో లోయర్ ​ఆర్డర్​లో లాథమ్​, నీషమ్​లకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశం రావట్లేదు. బంగ్లాతో మ్యాచ్​లో కీపర్​ లాథమ్​ డకౌటయ్యాడు. అవకాశం వస్తే ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగిన వారే.

బౌలింగ్​లో ట్రెంట్​ బౌల్ట్​, ఫెర్గూసన్​, హెన్రీలతో పేస్​ దళం బలంగా ఉంది. స్పిన్నర్​ నీషమ్​ ఎలాగూ ఉండనే ఉన్నాడు. శ్రీలంకపై ఫెర్గూసన్​, హెన్రీ తలో 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్​పై హెన్రీ 4, అఫ్గాన్​పై ఫెర్గూసన్​ 4, నీషమ్​ 5 వికెట్లతో చెలరేగారు.

టాప్​-5 ఆటగాళ్లు...

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
గప్తిల్ 3 98 -
విలియమ్సన్​ 3 119 -
టేలర్ 3 130 -
హెన్రీ 3 - 7
ఫెర్గూసన్ 3 - 8


భారత్​...

2011 ప్రపంచకప్​ నెగ్గింది భారత్​. ఈసారీ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. భారత్​కు బ్యాటింగ్​తో పాటూ అద్భుతమైన ప్రపంచస్థాయి బౌలింగ్​ దళం ఉంది.

ఇప్పటివరకు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది ఓపెనర్లే. సౌతాఫ్రికాపై రోహిత్​ శర్మ, ఆస్ట్రేలియాపై ధావన్​ శతకాలతో విజృంభించారు. విజయాలు తేలికయ్యాయి. వేలి గాయం కారణంగా ఇప్పుడు ధావన్​ దూరమయ్యాడు. రోహిత్​తో ఇన్నింగ్స్​ను ప్రారంభించేది ఎవరో తేలాల్సి ఉంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే ధావన్ లేని​ లోటు టీమిండియా విజయావకాశాలనూ ప్రభావం చూపనుంది.

  • రోహిత్​ శర్మ మంచి ఫామ్​లో ఉన్నాడు. అతడు కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టించగలడు. ఆడిన 2 మ్యాచుల్లో 179 పరుగులతో రాణించాడు.
  • మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చే కోహ్లీ కూడా అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. సౌతాఫ్రికాపై స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. 77 బంతుల్లో 82 పరుగులతో సత్తా చాటాడు. మిడిలార్డర్​ రాహుల్​, ధోని, జాదవ్​లతో బలంగా ఉంది.
  • రాహుల్​, జాదవ్​కు ఇప్పటివరకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశాలు రాలేదు. ధోని.. కూడా దూకుడుగా ఆడుతూ.. మోస్తరు స్కోరుతో రాణిస్తున్నాడు.

లోయర్​ ఆర్డర్​లో హార్దిక్​ పాండ్య చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడీ దూకుడైన బ్యాట్స్​మన్​. 27 బంతుల్లోనే 48 పరుగులు చేసి భారత్​ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను బౌలింగ్​లోనూ రాణించగలడు.

భారత బౌలింగ్​ దళం అత్యంత పటిష్ఠంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్​, పాండ్య పేస్​ విభాగాన్ని పంచుకోనున్నారు. చాహల్​, కుల్​దీప్​లు స్పిన్నర్లుగా ఉన్నారు.

స్పిన్నర్​ చాహల్​ సౌతాఫ్రికాపై 4 వికెట్లతో చెలరేగి కట్టడి చేయగలిగాడు. ఆ మ్యాచ్​లో బుమ్రా, భువీ రెండు వికెట్లతో రాణించారు.

ఆస్ట్రేలియాపై బుమ్రా, భువీ చెరో 3 వికెట్లు తీశారు. చాహల్​ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కుల్​దీప్​ యాదవ్​ అంచనాలకు తగ్గట్లుగా రాణించట్లేదు.

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
రోహిత్​ శర్మ 2 179 -
విరాట్​ కోహ్లీ 2 100 -
హార్దిక్​ పాండ్య 2 63 -
బుమ్రా 2 - 5
చాహల్​ 2 - 6

ఇటీవలి కాలంలో న్యూజిలాండ్​పై భారత్​ రికార్డు మెరుగ్గా ఉంది. అయితే.. ప్రపంచకప్​ టోర్నీల్లో మొత్తంగా కివీస్​దే పైచేయి.

గత 8 వన్డేల్లో ఆరింట్లో విజయం సాధించింది భారత్​. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​పై వారి సొంతగడ్డపైనే 4-1తో సిరీస్​ గెల్చుకుంది టీమిండియా.

కానీ.. ప్రపంచకప్​లో కివీస్​దే పైచేయి. మొత్తంగా ప్రపంచకప్​ టోర్నీ ముఖాముఖిల్లో న్యూజిలాండ్​ భారత్​పై మెరుగ్గా ఉంది. ఇరు జట్లు 7 మ్యాచుల్లో తలపడగా.. కివీస్​ 4, భారత్​ 3 విజయాలతో ఉన్నాయి.

ముఖాముఖి

భారత్
న్యూజిలాండ్
7 మ్యాచ్​లు 7
3 గెలుపు 4
4 ఓటమి 3
0 డ్రాగా ముగిసినవి 0
0 ఫలితం తేలనివి 0

చివరగా భారత్​-న్యూజిలాండ్​ ఈ మెగాటోర్నీలో పోటీపడింది 2003 ప్రపంచకప్​లోనే. సెంచూరియన్​ వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో భారత్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి ప్రపంచకప్​ 75, 79, 92, 99 లలో కివీస్​ చేతిలో పరాజయం పాలైంది భారత్​. 1987 ప్రపంచకప్​లో ఆ జట్టుతో తలపడిన రెండు మ్యాచుల్లోనూ భారత్​నే విజయం వరించింది.

టీమ్​ బలాబలాలే కాదు... వర్షం పడుతుందా అన్నదే అసలు ప్రశ్న. భారత్​-కివీస్​ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది. నాటింగ్​హామ్​లో గురువారం వాన పడొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఇదే జరిగితే.. మ్యాచ్​ పూర్తిగా రద్దవుతుంది. లేదా ఓవర్లు కుదిస్తారు. చూద్దాం... ఏం జరుగుతుందో.

Last Updated : Jun 13, 2019, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details