మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్‌లు ఆఖరి అంకానికి చేరుకొని రసవత్తరంగా తయారైతే... నాలుగో స్థానం కోసం ఇంకా.. జట్లు తలపడుతూనే ఉన్నాయి. మరి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఈరోజు బంగ్లాను ఓడించి సెమీస్‌లో చోటు పదిలం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 4లో చేరేందుకు అవకాశాలు మరింత సులువవుతాయి. మరి అలాంటి కీలక పోరుకు రెడీ అవుతోన్న ఇరుజట్ల బలాబలాలు ఓసారి పరిశీలిద్దాం.
ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్తు కోసం కీలక పోరుకు సిద్ధమైంది భారత జట్టు. మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో పోటీ పడనుంది. చావో రేవో తేల్చుకొనేందుకు బంగ్లా పులులు రెడీ అవుతున్నారు.
భారత్ పరిస్థితేంటి...
ఈ మ్యాచ్ గెలిస్తే 13 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు చేరుతుంది కోహ్లీసేన. ఓడితే శ్రీలంకతో చివరి మ్యాచ్ కోసం ఎదురు చూడాలి. సెమీఫైనల్ బెర్తులో ఏ స్థానం వస్తుందో తేల్చేది ఈ రెండు మ్యాచ్‌లే కావడం వల్ల భారత్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.
విరాట్ అంతకుమించి...
ప్రపంచ నెం.1 బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్ధశతకాలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఒక్క శతకమూ చేయలేకపోయాడు. కాబట్టి అతడి నుంచి శతక ప్రదర్శన ఆశిస్తున్నారు అభిమానులు.
- ఓపెనర్ రోహిత్ ఫామ్‌లో ఉన్నా పరుగులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకొంటున్నాడు. మరో ఓపెనర్ రాహుల్ నుంచి సరైన మద్దతు లభించట్లేదు. వరుస శతకాలతో కీలక ఆటగాడిగా రోహిత్ రాణించడం భారత్‌కు కలిసివచ్చేదే. నాలుగో స్థానం కోసం యువ బ్యాట్స్‌మెన్ పంత్‌కు మరో అవకాశం లభించనుంది.
- మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు రాబడుతున్నాడు. ధోనీ అవసరమైన సమయంలోనూ బ్యాట్ ఝుళిపించలేక సింగిల్స్‌కు మాత్రమే పరిమితమవడం విమర్శలకు తావిస్తోంది.
- బౌలర్లలో షమి, బుమ్రా అదరగొడుతున్నారు.
బంగ్లాకు చోటుందా...!
బంగ్లాదేశ్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. చివరి మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించాలి. అదే సమయంలో న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతే బంగ్లాకు సెమీస్ బెర్తు లభిస్తుంది.