ప్రాక్టీసులో భారత్-ఆసీస్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కప్పుపై కన్నేసిన భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం కెనింగ్టన్ ఓవల్ మైదానంలో తలపడనున్నాయి. సమఉజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు ఎలా సాగుతోందని దేశమంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్, ధోని.. బౌలింగ్‌లో బుమ్రాపై భారత్ ఎన్నో ఆశలతో బరిలోకి దిగుతోంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతుంది.
పిచ్ అనుకూలం...జాగ్రత్త అవసరం:
ఓవల్ పిచ్ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. వర్ష సూచన కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో స్కోర్లు 300 దాటాయి. బంగ్లాదేశ్ లాంటి జట్టు దక్షిణాఫ్రికాపై 330 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఫాస్ట్‌బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాపై హెన్రీ, దక్షిణాఫ్రికాపై ఆర్చర్ చెలరేగిన తీరు చూస్తే ఆదివారం బుమ్రాతో కంగారూలకు.. స్టార్క్, కమిన్స్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు చిక్కులు తప్పకపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగే ఎంచుకునే అవకాశముంది.
అయితే భారత్ అజాగ్రత్తగా ఉండకూడదు ఎందుకంటే ఇదే వేదికగా కివీస్‌తో ప్రాక్టీసు మ్యాచ్‌లో 179 పరుగులకే ఆలౌటైంది టీమిండియా. బౌల్ట్, నీషమ్ వంటి పేస్ బౌలింగ్‌లో భారత్ తడబడింది.
భారత్(బలాలు-బలహీనతలు)
బ్యాటింగ్‌లో ఇటీవల సెంచరీతో అదరగొట్టిన రోహిత్ ఫామ్‌లోకి రాగా... మరో ఓపెనర్ ధావన్ నిరాశపర్చుతున్నాడు. ఆరంభంలోనే తక్కువ పరుగులకే ఔటవ్వడం వల్ల ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన బాధ్యత మిడిలార్డర్ మీద పడుతోంది. రాహుల్, ధోనీ రాణిస్తే ఛేదనలో లోయర్ ఆర్డర్‌పై ఎలాంటి ప్రభావం పడదు. షార్ట్‌పిచ్ బంతులు, యార్కర్లతో భారత్ బ్యాట్స్మెన్లు పరీక్ష ఎదుర్కోనున్నారు.
బౌలింగ్‌లో చక్కటి ఫామ్‌లో ఉన్న షమిని తొలి మ్యాచ్‌కు పక్కనపెట్టారు. ఎందుకంటే దక్షిణాఫ్రికా బలహీనత స్పిన్ ఆడలేకపోవడం అందుకే ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది టీమిండియా. ఓవల్ పేస్‌కు అనుకూలం కాబట్టి షమి వస్తే బుమ్రా, భువనేశ్వర్‌లతో బౌలింగ్ లైనప్ పదునుగా తయారవుతుంది. ఇక స్పిన్నర్లలో కుల్దీప్, చాహల్లో ఎవరు వస్తారో చూడాల్సి ఉంది.
- దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలింగ్‌ను కొంచెం కష్టం మీద ఎదుర్కొన్నా స్పిన్‌లో మాత్రం బాగా పరుగులు రాబట్టారు.
ఆస్ట్రేలియా (బలాలు- బలహీనతలు)
గతంలో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా ఉండేది కాదు. నిషేధం పూర్తి చేసుకుని మళ్లీ బ్యాట్ పట్టుకున్న వార్నర్ ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. మరో బ్యాట్స్‌మెన్ స్మిత్ అనభవజ్ఞుడు.. అంతేకాదు భారత్‌పై మంచి రికార్డు ఉంది. విధ్వంసక వీరులు మ్యాక్స్‌వెల్, ఫించ్ చాలా ప్రమాదకారులు. భారత్ అంటేనే చెలరేగి ఆడేందుకు సిద్ధమవుతుంటారు. అయితే వీళ్లందరిని మాయ చేసి బుట్టలో వేయగలిగే నేర్పరి బుమ్రా. ఈ మ్యాచ్‌లో ఈ స్పీడ్‌స్టర్ రాణిస్తే విజయం తథ్యం.
బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ వేగవంతమైన బౌలర్లు. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ సత్తా చాటారు. ఓవల్ ఫాస్ట్‌కు స్వర్గధామం కాబట్టి వీరిని ఎదుర్కోడానికి భారత బ్యాట్స్మెన్లు ప్రణాళికలు రచించాల్సిందే. స్పిన్నర్లలో జంపా నుంచి కొంచెం ముప్పు ఉన్నా మనోళ్లు స్పిన్ ఆడటంలో ఆరితేరి ఉన్నారు.
- ఈ ప్రపంచకప్‌లో విండీస్ పేస్ బౌలింగ్‌ను, అఫ్గాన్ స్పిన్‌ను బాగానే ఎదుర్కొన్న ఆస్ట్రేలియా... భారత బౌలింగ్ ఎదుర్కోవడంలో జూనియర్ ఆటగాళ్లకు తిప్పలు తప్పవు.
నువ్వా-నేనా:
- ఆస్ట్రేలియా చివరిగా ఆడిన ఐదు వన్డేల్లో ఐదింటిలోనూ గెలిచింది. భారత్ ఐదు మ్యాచుల్లో రెండే గెలిచింది.
- 136 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు పోటీపడగా...భారత్ 49, ఆస్ట్రేలియా 77 విజయాలు సాధించాయి. 10 ఫలితం తేలలేదు.
- ప్రపంచకప్‌లో ఆసీస్-భారత్ 11 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో 8 ఆస్ట్రేలియా, 3 భారత్ నెగ్గింది. చివరిగా 2015 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడగా.. ఆస్ట్రేలియానే గెలిచింది.
- ఓవల్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండు మాత్రమే నెగ్గి ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
- ఈ మైదానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్న ఆసీస్‌ను భారత్ ఓడిస్తే... సరాసరి 7 నుంచి 2 లేదా 3వ స్థానం కైవసం చేసుకొనే అవకాశం ఉంది. అదే ఆస్ట్రేలియా గెలిస్తే తొలి స్థానం ఆ జట్టు సొంతమవుతుంది.
భారత్ రెండు విజయాలతో ఘనంగా ముందుకెళ్తుందో... లేదంటే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ సాధిస్తుందో చూడాల్సిందే.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ (సారథి), రాహుల్, ధోని, పాండ్యా, జాదవ్, భువనేశ్వర్, షమీ, కుల్దీప్/చాహల్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్(సారథి), వార్నర్, స్మిత్, ఖవాజా, మాక్సెవెల్, స్టార్క్, కౌల్టర్‌నైల్, కమిన్స్, జంపా, స్టొయినిస్, క్యారీ.