మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు 2021 మహిళల వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ (2017-2020)లో భాగంగా ఆడాల్సివున్న మూడు సిరీస్‌లు రద్దవగా, ఆ సిరీస్‌లకు సంబంధించి ఐసీసీ తాజాగా పాయింట్లను పంచింది.
ఇందులో రెండు సిరీస్‌ల రద్దుకు కరోనా కారణం కాగా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌తో సిరీస్ ఆడేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో ప్రతి జట్టూ.. మరో జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడాలి.
ఎంపికైన జట్లు ఇవీ..
ఆతిథ్య న్యూజిలాండ్, పాయింట్ల పట్టికలో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న మరో నాలుగు జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ 23 పాయింట్లతో ఆస్ట్రేలియా (37), ఇంగ్లాండ్ (29), దక్షిణాఫ్రికా (25)ల తర్వాత నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జులైలో క్వాలిఫయర్స్..
ఆతిథ్య హోదాలో టోర్నీలో ఆడే హక్కు న్యూజిలాండ్‌కు దక్కింది. శ్రీలంకలో జులై 3 నుంచి 19 వరకు జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. కరోనా నేపథ్యంలో ఈ అర్హత టోర్నీ వాయిదా తప్పకపోవచ్చు.
ఇదీ చూడండి:ఐపీఎల్ నిరవధిక వాయిదా.. సీజన్ నిర్వహణ సందేహమే