సఫారీ జట్టు బౌలర్ ఇమ్రాన్ తాహీర్ అందరికీ సుపరిచితం. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటిన ఈ సీనియర్ ఆటగాడు... భారత్‌లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన బౌలింగ్‌లో వికెట్ పడితే... గ్రౌండ్లో ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తూ సందడి చేస్తాడు. దాన్ని అభిమానులు ఎంతగానో ఆస్వాదిస్తారు. అందుకే అతడిని పరాశక్తి ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకుంటారు.
నేడు మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది సపారీ జట్టు. ఈ మ్యాచ్ తర్వాత వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు తాహీర్.
" జట్టుగా మేము ప్రపంచకప్‌లో మంచి ముగింపు ఇవ్వాలని భావించాం. కానీ అది జరగలేదు. నేను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నాను. ఇది ఎంతో బాధగా ఉంది. ఉద్వేగానికి లోనవుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఎన్నో కలలు కన్నాను. వాటిని సాకారం చేసుకొనేందుకు నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను విదేశాల నుంచి వచ్చినా నాకు జట్టులో అవకాశం ఇచ్చారు. నా జీవితంలో క్రికెట్ ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లు ఆడాలని కోరుకున్నా... కానీ వన్డేల నుంచి నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది".
--ఇమ్రాన్ తాహీర్, దక్షిణాఫ్రికా ఆటగాడు