ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2019ని నేరుగా వీక్షించాలనుకునే వారికి శుక్రవారమే ఆఖరి అవకాశం. ఈ మెగా టోర్నీ చూడాలంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రపంచకప్ నిర్వాహకులు.
ఈ ఏడాది క్రికెట్ ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. 95 శాతం టికెట్లు (దాదాపు 8 లక్షలు) ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే మిగిలిన 5శాతం టికెట్లను చివరి దశగా శుక్రవారం అమ్మకానికి పెట్టనున్నారు.
గత నెల వరకు టికెట్లు కొనుగోలు చేసిన అందరికీ కొరియర్లు, పోస్టులు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇంకా అందుకోలేనివారు మ్యాచ్‌ల ఆరంభానికి వారం ముందే టికెట్లు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎవరికైనా టికెట్లు రాకపోయినా, డబ్బులు వాపస్ కాకపోయినా సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు.
" ప్రపంచకప్‌కు అందుబాటులో ఉన్న 8 లక్షల టికెట్ల కోసం 148 దేశాలు, 6 ఖండాల నుంచి 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మడగాస్కర్, మెక్సికో నుంచీ దరఖాస్తులు రావడం మెగాటోర్నీపై ఇష్టాన్ని ప్రతిబింబిస్తోంది. టికెట్లు కొనుగోలు చేయని అభిమానులకు చివరిసారి అవకాశం వచ్చింది. అభిమానులు అధికారిక వెబ్‌సైట్ నుంచే టికెట్లు కొనుగోలు చేయాలి." -ఐసీసీ
మే 30న ఆరంభమవుతోన్న ఈ మెగా టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.