దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ఐసీసీ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ కళాఖండాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందులో ఓ చేతిలో బ్యాట్, మరో చేతిలో బాల్, కిరీటం ధరించి, సుల్తాన్‌ను పోలిన డ్రెస్‌లో దర్శనమిచ్చాడు విరాట్. అంతేకాదు గతంలో ఇండియా గెలిచిన ప్రపంచకప్ సంవత్సరాలు.. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్ అని కోహ్లీని కీర్తించింది ఐసీసీ.
టీమిండియా కెప్టెన్‌ను ఈ విధంగా గౌరవించడం బాగుందంటూ కొందరు ఐసీసీని మెచ్చుకున్నారు. అంతా బాగుంది కానీ.. ఈ చిత్రంలో విరాట్ ఏంటి? రాహుల్‌లా కనిపిస్తున్నాడు అంటూ ఓ ట్వీట్. అంతే దాని తర్వాత వరుస ట్వీట్లతో ఐసీసీపై విమర్శల పర్వం మొదలైంది. 'కోహ్లికి కేఎల్ రాహుల్ లుక్ ఏంటి?' అని ఒకరు.. 'కోహ్లీ అని కాకుండా కేఎల్ రాహుల్' అని పేరు పెడితే బాగుండేదని ఇంకొకరు విమర్శించడం మొదలు పెట్టారు. మరోవైపు 'ఏ జట్టు కెప్టెన్‌కూ ఇవ్వని గౌరవం ఇండియన్ కెప్టెన్‌కు మాత్రమే ఎందుకు' అంటూ మరో రకమైన విమర్శలు మొదలయ్యాయి. 'బీసీసీఐ ఐసీసీని సొంతం చేసుకుంద'ని ఒకరు.. 'ఐసీసీ టీమిండియా అభిమానిలా వ్యవహరిస్తోంది' అని మరొకరు కామెంట్ల వర్షం కురిపించారు. ఏదో సరదాగా ఫొటో పెట్టిన ఐసీసీకి ఈ రూపంలో షాకిచ్చారు నెటిజన్లు.