సౌతాంప్టన్ మైదానంలో పాఠశాల విద్యార్థుల కోసం ఐసీసీ ఏర్పాటు చేసిన క్లినిక్‌లో కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ సహా భారత జట్టు సభ్యులు పాల్గొన్నారు. చిన్నారుల జీవితాల్లో క్రికెట్ మార్పు తీసుకొస్తుందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. వారిని మెరుగైన వారిగా తయారు చేస్తుందన్నాడు.
ఆట కష్టాలు ఎదుర్కోవడం నేర్పుతుంది: కోహ్లి
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో బిజీ షెడ్యూల్లో ఉన్న భారత ఆటగాళ్లు స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడి కనువిందు చేశారు.
" చిన్నారుల జీవితాల్లో క్రికెట్ మార్పు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నా. వారిని మెరుగైన మనుషులుగా తయారు చేస్తుందనే విశ్వాసముంది. ఎందుకంటే జీవితంలో మాదిరిగానే క్రికెట్‌లోనూ అనేక దశలుంటాయి. ఒడుదొడుకులతో పాటు మంచి పరిస్థితులు అనుభవిస్తాం. గడ్డుకాలం నుంచి ఎలా బయటపడాలో అవగాహన వస్తుంది. అందుకే చాలా విధాలుగా క్రికెట్ ఒక మంచి గురువు. చిన్నారులతో కాసేపు గడపడం ఆనందాన్నిస్తోంది. వారి ప్రయాణంలో ఎంతో కొంత మేలు చేసేందుకు అవకాశం లభించింది. వారెంతో నిజాయతీ, అంకితభావంతో ఉంటారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడినప్పుడు కలిగిన సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ".
--విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
విద్యార్థులతో కాసేపు క్రికెట్ ఆడి అలరించారు భారత క్రికెటర్లు. హార్దిక్ పాండ్య చిన్నారులను సంతోషపెట్టేందుకు పదేపదే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ వారితో సరదాగా కలిసిపోయాడు.