ఓవల్ వేదికగా ఆదివారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ప్రవర్తన టాంపరింగ్ సందేహాలు రేకెత్తించింది. తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడమే ఈ సందేహాలకు కారణం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపించాయి. జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై ఆసీస్ సారథి ఫించ్ సమాధానమిచ్చాడు.
జంపా హ్యాండ్‌వార్మర్ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని చెప్పుకొచ్చాడు ఫించ్. ఈ సాధానాన్ని బిగ్‌బాష్ లీగ్‌తో పాటు.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఉపయోగిస్తాడని వెల్లడించాడు. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే వాడతాడని స్పష్టం చేశాడు ఫించ్.