క్రికెట్‌కు పుట్టినిల్లు.. ఇంగ్లాండ్. అయినా... ప్రపంచ కప్ నెగ్గాలనే కల సాకారం చేసుకునేందుకు 44 ఏళ్లు పట్టింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో గెలిచి, కప్ దక్కించుకుంది ఇంగ్లాండ్. టైగా ముగిసిన మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ ద్వారా విజయం సాధించింది. అయితే ఇంగ్లీష్ జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు వేరే దేశాల నుంచి వలస వచ్చినవాళ్లే. బెన్ స్టోక్స్ మొదలు జోఫ్రా ఆర్చర్ వరకు ఆరుగురు ఆటగాళ్లు ఆంగ్లేయులు కాదు.
ఇంగ్లాండ్‌ను గెలిపించిన న్యూజిలాండర్...
ప్రపంచకప్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడు బెన్ స్టోక్స్. అతడు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ కివీస్ రగ్బీ జట్టు ప్లేయర్. ఆ దేశం తరఫున చాలా మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. బెన్ స్టోక్స్ చిన్నతనంలోనే ఇంగ్లాండ్‌కు మకాం మార్చాడు అతడి తండ్రి గెరార్డ్. ఆసక్తికర విశేషమేమంటే ఫైనల్ మ్యాచ్‌లో తండ్రి న్యూజిలాండ్‌కు మద్దతు పలుకుతుంటే కుమారుడు ఇంగ్లాండ్‌ను గెలిపించేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. ఈ ప్రపంచకప్‌లో 66.6 సగటుతో 465 పరుగులు చేశాడు స్టోక్స్. బౌలింగ్‌లోనూ 7 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఐరీష్ మ్యాన్ ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ అయ్యాడు..
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పుట్టి పెరిగింది ఐర్లాండ్‌లో. ఆ దేశం తరపున అండర్- 19 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐర్లాండ్ తరఫున 23 అంతర్జాతీయ వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. మెరుగైన కెరీర్ కోసం ఇంగ్లాండ్‌కు మకాం మార్చాడు మోర్గాన్. 2009లో ఇంగ్లాండ్ తరపున టీ 20ల్లో అరంగేట్రం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 371 పరుగులు చేశాడు. 2015 వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లీష్ జట్టుకు మోర్గానే సారథి.
విండీస్ వీరుడు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ అయ్యాడు..