తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​పై 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్​ గెలుపు - rashid khan

ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్​లో ఇంగ్లాండ్​ ఘన విజయం సాధించింది. 398 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు మాత్రమే చేయగలిగింది అఫ్గాన్​. శతకంతో అలరించింన ఇంగ్లాండ్​ జట్టు సారథి ఇయాన్​ మోర్గాన్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ లభించింది.

హ్యాట్రిక్​ కొట్టిన ఇంగ్లాండ్​.. అఫ్గాన్​పై 150 పరుగుల విజయం

By

Published : Jun 18, 2019, 11:52 PM IST

Updated : Jun 19, 2019, 9:53 AM IST

ఇంగ్లాండ్​-అఫ్గానిస్థాన్ మ్యాచ్​ హైలైట్స్

ఐసీసీ ప్రపంచకప్​ 2019లో టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అఫ్గాన్​తో మంగళవారంజరిగిన పోరులో 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 398 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది.

వికెట్లు కాపాడుకున్నా...పరుగులు చేయలేదు​

భారీ లక్ష్యం ఒకవైపు... పటిష్ఠ పేస్​ బౌలింగ్​ లైనప్​ మరోవైపు.. అయినా అఫ్గాన్ జట్టు కనీస పోటీ ఇచ్చింది.

ఓపెనర్​ నూర్​ అలీ డకౌట్​గా వెనుదిరిగాడు. సారథి​ గుల్బాదిన్​, రెహ్మత్​​ షా ఇన్నింగ్స్​ గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. గుల్బదిన్​ 37, షా 46 పరుగులు చేశారు. మంచి జోరు చూపించిన గుల్బాదిన్​ ఔటయ్యాక అఫ్గాన్​ ఇన్నింగ్స్​ నెమ్మదించింది.

హస్మతుల్లా పోరాటం...

హస్మతుల్లా 100 బంతుల్లో 76 పరుగులతో మంచి ప్రతిభ కనబరిచినా... వికెట్​ కాపాడుకునే ప్రయత్నంలో బంతులు వృథా చేశాడు. అస్ఘర్​​ 48 బంతుల్లో 44 పరుగులతో కాసేపు బ్యాట్​ ఝుళిపించినా కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు పసికూనల సత్తా చాలలేదు. లోయర్​ ఆర్డర్​ కూడా వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పోగొట్టుకుంది. నబీ 9 పరుగులు, నజీబుల్లా 15, రషీద్​ ఖాన్​ 8 పరుగులకే ఔటయ్యారు.

ఇంగ్లాండ్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​, ఆదిల్​ రషీద్​ చెరో 3 వికెట్లు, మార్క్​ వుడ్​ 2 వికెట్లు సాధించారు.

తొలుత బ్యాటింగ్​ చేసిన ఇంగ్లాండ్‌ భారీ స్కోరు చేసింది. సారథి ఇయాన్‌ మోర్గాన్‌ 71 బంతుల్లో 148 పరుగులు (4 ఫోర్లు, 17 సిక్సర్లు) శతకంతో చెలరేగి ఆడాడు. అతనితో పాటు బెయిర్‌స్టో 99 బంతుల్లో 90 (8 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్‌ 82 బంతుల్లో 88 (5 ఫోర్లు, సిక్స్​) అర్ధశతకాలతో రాణించారు. ఫలితంగా ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది.

మోర్గాన్​ సిక్సర్ల పిడుగు....

అఫ్గాన్​తో మ్యాచ్​లో మోర్గాన్​ సిక్సర్ల మోత మెగించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 సిక్స్‌లు బాది వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రికార్డులో నూతన చరిత్ర సృష్టించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్‌ నిలిచాడు. ఇప్పటివరకూ వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో రోహిత్‌శర్మ(16 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(16), క్రిస్‌ గేల్‌(16) ముందు వరుసలో ఉన్నారు. తాజాగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మోర్గాన్‌ ఈ రికార్డును అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

అంతేకాకుండా 57 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. ప్రపంచకప్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. తర్వాత దూకుడు పెంచిన మోర్గాన్‌ 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇతని ధాటికి అఫ్గాన్‌ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. రషీద్‌ ఖాన్‌ 9 ఓవర్లు బౌలింగ్‌ చేసి వికెట్లేమీ పడగొట్టకుండా ఏకంగా 110 పరుగులు ఇచ్చాడు.

అఫ్గాన్ బౌలర్లలో జద్రాన్, గుల్బాదిన్​ నైబ్​​లకు చెరో 3 వికెట్లు దక్కాయి.

Last Updated : Jun 19, 2019, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details