తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: నాకౌట్​ పోరులో 3, 4 స్థానాలెవరివి...? - cricket world cup 2019

ప్రపంచకప్‌లో నేడు ఆతిథ్యజట్టు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య కీలక పోరు జరగనుంది. సెమీస్‌ రేసులో ఉన్న ఇరు జట్లు చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా తలపడనున్నాయి. సెమీస్‌లో చోటు దక్కాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను ఇరుజట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరనుంది. ఓడినజట్టు మాత్రం ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

నాకౌట్​ పోరులో మూడు, నాలుగెవరిది...?

By

Published : Jul 3, 2019, 6:41 AM IST

క్రికెట్‌ వరల్డ్​కప్​లో నేడు కీలకపోరుకు తెరలేవనుంది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీకి సిద్ధమవుతున్నాయి. భారత్‌పై గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్‌ను... న్యూజిలాండ్‌ అడ్డుకుంటుందా..! ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లి అనూహ్యంగా పాకిస్థాన్​, ఆస్ట్రేలియాతో ఓడిపోయి సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కివీస్​ జట్టు. మరి నేటి మ్యాచ్‌ రెండు జట్లకు చావోరేవో అన్నట్లు తయారైంది.

  • గెలిస్తే ఇలా...

టీమిండియాపై ఇంగ్లాండ్‌ గెలవడం వల్ల న్యూజిలాండ్‌కు నాకౌట్​ చేరడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవేళ ఇంగ్లాండ్‌ ఓడిపోయి ఉంటే కివీస్‌కు సెమీస్‌ బెర్తు ఖరారయ్యేది. భారత్‌పై ఆతిథ్య జట్టు గెలిచినందున... కివీస్‌ నేటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది.

కోహ్లీసేనపై 31 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఇంగ్లాండ్‌ జట్టు... కివీస్‌తో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది.

  • ఓడిపోతే అలా...

ఈ రోజు కివీస్‌తో జరిగే మ్యాచ్​లో ఇంగ్లాండ్​ ఓడిపోతే ఆతిథ్య జట్టు భవిష్యత్తు బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ గెలిస్తే ఇంగ్లాండ్‌ ఇంటిముఖం పడుతుంది.

ఒకవేళ న్యూజిలాండ్​ ఓటమి పాలైతే 11 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు జులై 5న జరగనున్న బంగ్లా, పాకిస్థాన్​ మ్యాచ్​ ఫలితంపై కివీస్​ సెమీస్​ బెర్త్​ ఆధారపడి ఉంటుంది. అందులో బంగ్లా గెలిస్తే నాలుగో స్థానంతో న్యూజిలాండ్​ సెమీస్​కు వెళ్తుంది. పాక్​ గెలిస్తే.. 11 పాయింట్లతో న్యూజిలాండ్​తో సమంగా ఉంటుంది. మళ్లీ రన్​రేట్​పై ఆధారపడాల్సి వస్తుంది.

ఇంగ్లాండ్​ బలాబలాలు...

ఇంగ్లాండ్‌ జట్టుకున్న బ్యాటింగ్‌ బలానికి ఆ టీమ్​ ఇప్పటికే సెమీస్‌ చేరాల్సింది. కానీ శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఓటములతో ఆ జట్టు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. అయితే సెమీస్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మోర్గాన్‌ సేన....నేడు బ్లాక్​ క్యాప్స్​పై అదే ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది.

గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లీష్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌... భారత్‌పై తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మరో ఓపెనర్‌ బెయిర్‌ స్టో అద్భుత సెంచరీతో చెలరేగడం, ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ భీకరఫామ్​లో ఉండడం ఇంగ్లాండ్‌కు సానుకూలాంశం.

బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ కట్టుదిట్టంగా బంతులేస్తున్నాడు. మొయిన్‌ అలీ స్థానంలో వచ్చిన లియామ్‌ ప్లంకెట్‌ భారత్‌తో మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగాడు.

న్యూజిలాండ్​ బలాబలాలు...

న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ భారమంతా కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక్కడే మోస్తున్నాడు. మరో సీనియర్ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ మాత్రమే విలియమ్సన్‌కు సహాయంగా నిలుస్తున్నాడు. మిగిలినవారు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కివీస్‌ను కలవరపెడుతోంది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ఘోరంగా విఫలమవుతున్నాడు.

కివీస్‌ బౌలింగ్‌ విభాగంలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గూసన్​ కీలక సమయాల్లో వికెట్లను తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాపై బౌల్ట్‌ హ్యాట్రిక్‌ తీసి సత్తా చాటాడు.

ఇరు జట్లు...

  • ఇంగ్లాండ్​:

జేసన్​ రాయ్​, బెయిర్​ స్టో, జో రూట్​, ఇయాన్​ మోర్గాన్​(సారథి), బెన్​ స్టోక్స్​, జాస్​ బట్లర్​(కీపర్​), క్రిస్​ వోక్స్​, మార్క్​ ఉడ్​, జోఫ్రా ఆర్చర్​, లియామ్​ ప్లంకెట్​, ఆదిల్​ రషీద్​

  • న్యూజిలాండ్​:

హెన్రీ నికోలస్​, మార్టిన్​ గప్తిల్​, కేన్​ విలియమ్సన్​(సారథి), రాస్​ టేలర్​, టామ్​ లాథమ్(కీపర్​)​, కోలిన్​ డి గ్రాండ్​హోమ్​, జిమ్మీ నీషమ్​, మిచెల్​ సాంట్నర్​, ఇష్​ సోధీ/ టిమ్​ సౌథీ, ఫెర్గూసన్​, ట్రెంట్​ బౌల్ట్​

ABOUT THE AUTHOR

...view details