2005 ఏప్రిల్‌లో భారత్ పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్ ఆరంభంలో రనౌట్ అయ్యాడు. అప్పుడు వన్‌డౌన్‌లో నూనుగు మీసాలతో ఓ 24 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్‌కు దిగాడు. అందరూ ఇతను ఏమి ఆడతాడులే.. సెహ్వాగ్‌కు అండగా నిలిస్తే చాలని అనుకున్నారు. కానీ భీకర రీతిలో అద్భుతమైన సెంచరీ చేశాడు. అతడే మహేంద్ర సింగ్ ధోనీ. 148 పరుగులతో రెచ్చిపోయాడు. మరుసటి రోజు పత్రికల్లో, టీవిల్లో ఇదే వార్త. ముఖ్యంగా వినూత్నంగా ధోనీ ఆడిన షాట్ గురించే చర్చ. అనంతరం హెలికాప్టర్ షాట్‌గా బాగా పాపులర్ అయింది. ఈ షాట్‌ను మహీకి అతడి స్నేహితుడు సంతోష్ లాల్ నేర్పించాడు.
సమోసా కోసం హెలీకాప్టర్ షాట్ నేర్పించాడు..
హెలికాప్టర్ షాట్ తనకు సంతోష్ అనే స్నేహితుడు నేర్పించాడని ధోనినే చాలా సార్లు తెలిపాడు. చిన్నతనం నుంచే మిత్రులైన వీరిద్దరూ జార్ఖాండ్ తరపున రంజీ మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. ఆసక్తికరమైన విషయమేమంటే సమోసాల కోసం ధోనికి హెలికాప్టర్ షాట్ ఎలా ఆడాలో నెర్పాడంట సంతోష్. ఈ షాట్‌ను అతడు(సంతోష్) 'తప్పడ్ షాట్' అని పిలిచేవాడంట. అతికొద్దిమందితోనే సన్నిహితంగా ఉండే ధోని చివరి వరకు సంతోష్‌ను వదులుకోలేదు.
అనారోగ్యంతో మిత్రుని మరణం..
2013లో క్లోమ గ్రంథి వాచి(పాంక్రియాటైటిస్) సంతోష్ మరణించాడు. మిత్రుడిని రక్షించేందుకు మహీ అన్ని విధాలుగా ప్రయత్నించాడు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ స్నేహితుడి బాగోగులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నాడు. సంతోష్ పరిస్థితి తీవ్రమైన తరుణంలో రాంచీ నుంచి దిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాడు చేశాడు మహీ. అయితే వాతావరణం అనుకూలించక ఆ హెలికాప్టర్ వారణాసిలోనే దిగిపోయింది. అప్పటికే సంతోష్ పరిస్థితి విషమించింది. మిత్రుని మరణం ధోనిని ఎంతో కలచి వేసింది.
టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతూ ఇద్దరూ రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లకు హాజరయ్యేవారని సంతోష్ ఇంకో స్నేహితుడు నిషాంత్ తెలిపాడు. ధోని, సంతోష్ చిన్నతనం నుంచి ప్రాణస్నేహితులని చెప్పాడు. సంతోష్ బ్యాటింగ్ శైలి అంటే మహీకి ఎంతో ఇష్టమని, ఎప్పుడూ అభినందిస్తుంటాడని తెలిపాడు.
2016లో ధోని జీవితం ఆధారంగా బాలీవుడ్లో వచ్చిన 'ధోని అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలోనూ సంతోష్ గురించి ఉంటుంది. ఈ సినిమాలో సంతోష్.. మహీకి హెలికాప్టర్ షాట్ ఎలా నేర్పించాడో చూపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. మహీ పాత్రలో మెరువగా.. సంతోష్ పాత్రను కృష్ణ ప్రకాశ్ జా పోషించాడు. ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇది చదవండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'