ఐపీఎల్ సందడి అయిపోయింది... ఎన్నికల సమరం ముగిసింది.. విద్యార్థుల పరీక్షల పోరు సమాప్తమైంది.. ఇక మిగిలిందల్లా ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రికెట్ యుద్ధమే. ఈ పోరులో గెలిచేది ఎవరు? సవాళ్లను దాటి విశ్వ విజేతగా నిలిచేది ఎవరు? వరల్డ్‌కప్ కోసం స్మిత్ అంకితభావాన్ని, విజేత కావాలనే మోర్గాన్ లక్ష్యాన్ని భారత సారథి కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడు? వీటన్నింటికి సమాధానం నేటి నుంచే తెలియనుంది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ సారథి మోర్గాన్ - దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ రౌండ్ రాబిన్ విధానంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో పది దేశాలు బరిలో దిగుతున్నాయి. సెమీస్‌కు చేరాలంటే ప్రతీ జట్టు కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి. ఈ అంశంపై దృష్టి పెట్టాయి అన్ని జట్లు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, విండీస్ జట్లు ప్రపంచకప్‌లో ప్రధాన జట్లుగా బరిలో దిగుతున్నాయి.
వరల్డ్‌కప్‌లో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ కెప్టెన్‌గా కోహ్లీ కల నెరవేరేనా...
అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది భారత జట్టు. బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, చాహల్‌లు కీలకం కానున్నారు. సారథి విరాట్ కోహ్లీతో పాటు ధావన్, రోహిత్,ధోని, హార్దిక్ పాండ్యలతో టీమిండియా బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో కొన్ని సమస్యలున్నప్పటికీ జట్టు బలంగా ఉంది. సెమీస్ వెళ్లేందుకు ఎక్కువ అవకాశమున్న జట్లలో భారత్ ముందు వరుసలో ఉంది. ఇంతకు ముందు ప్రపంచకప్ ఆడిన ఏ భారత జట్టు ఇప్పుడున్నంత బలంగా లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
వార్నర్ - స్మిత్ రాణించేనా..
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆస్ట్రేలియాకు బలం చేకూరింది. ఐపీఎల్లోవార్నర్ 692 పరుగులు చేసి ప్రపంచకప్ ముందే ప్రత్యర్థులకు తన ఫామ్‌పై సంకేతాలిచ్చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకం చేసి స్టీవ్ స్మిత్ కూడా జోరుమీదున్నాడు. వీరితో పాటు ఉస్మాన్ ఖవాజా, ఆరోన్ ఫించ్, కమిన్స్ సత్తా చాటగలిగే బ్యాట్స్‌మెన్. బౌలర్లు మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లయన్, ఆడం జంపాలతో ఆసీస్ జట్టు సమతూకంగా ఉంది.
ఇంగ్లాండ్ ప్రపంచకప్ కల నెరవేరేనా..
44ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా వరల్డ్‌కప్‌ను ముద్దాడలేకపోయింది ఇంగ్లాండ్. ఇప్పటికి 4 సార్లు స్వదేశంలో ఈ మెగాటోర్నీ జరిగినా.. నిరాశే ఎదురైంది. మోర్గాన్ సారథ్యంలో సొంతగడ్డపై ఐదోసారి జరుగుతున్న ఈ టోర్నీలో గెలిచి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనుకుంటోంది ఇంగ్లాండ్. బట్లర్, బెయిర్ స్టో, మోర్గాన్, రూట్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ లాంటి ఆల్‌రౌండర్లతో పాటు జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ లాంటి బౌలర్లతో పటిష్ఠంగా ఉంది ఇంగ్లీష్ జట్టు.
పాక్ పరాక్రమం చూపించేనా..
అంచనాలకు అందకుండా ఆడి అందరినీ ఆశ్చర్యపరిచే జట్టు పాకిస్థాన్. రేసులో లేదనుకునేలోపే అద్భుతం చేసేస్తుంది. ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, మహమ్మద్ హఫీజ్, బాబర్ అజామ్, హారీస్ సోహైల్ లాంటి ప్రతిభావంతులకు ఆ జట్టులో కొదవలేదు. తనదైన రోజున విజృభించే పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం.
కివీస్ కప్పు గెలిచేనా..
వార్మప్ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. కేన్ విలియమ్స్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో లాంటి ఆటగాళ్లతో కివీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది . ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, జిమ్మి నీషమ్ లాంటి బౌలర్లతో 2015 సీజన్ కంటే మంచి ప్రదర్శన చేయాలని భావిస్తోంది న్యూజిలాండ్. బౌలర్లు... బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండడం కివీస్‌కు కలిసొచ్చే అంశం.
దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసొచ్చేనా..
బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎప్పుడు చూసినా బలంగా కనిపించే దక్షిణాప్రికా జట్టు... ప్రపంచకప్ కల మాత్రం ఇప్పటివరకు తీర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డుప్లెసిస్ సారథ్యంలో బరిలో దిగుతున్న ప్రొటీస్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. డికాక్, ఆమ్లా, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉండగా... కగిసో రబాడా, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, ఎంగిడిలతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది.
విండీస్ విజృంభించేనా..
విధ్వంసకర ఆటగాళ్లతో బలంగా ఉంది వెస్టిండీస్ జట్టు. క్రిస్ గేల్, షాయ్ హోప్, ఆండ్రీ రసెల్‌లు ఎప్పుడైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. ఐపీఎల్లో సత్తాచాటిన గేల్, రసెల్... మెగాటోర్నీలో విజృంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. మొదటి రెండు ప్రపంచకప్ టోర్నీలు గెలిచిన విండీస్‌కు... ఆ తర్వాత టైటిల్ అందని ద్రాక్షలాగే మారింది.
పసికూనలు పట్టు సాధించేనా..
చిన్నజట్టుగా బరిలో దిగుతున్న అఫ్గానిస్థాన్ ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. రషీద్ ఖాన్, నబీ, మహమ్మద్ షెహజాద్ లాంటి వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఈ జట్టు సొంతం. జట్ల బలాబలాల పరంగా బంగ్లాదేశ్, శ్రీలంక కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ తక్కువ అంచనా వేయలేం. బంగ్లాలో షకీబ్, మొర్తజా, తమీమ్ ఇక్బాల్, ముష్ఫీకర్ రహీమ్ కీలక ఆటగాళ్లు. శ్రీలంకలో మలింగ, కరుణరత్నే అనుభవజ్ఞులైన క్రీడాకారులు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న 12వ వరల్ట్‌కప్ టోర్నీ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా నేడు ప్రారంభం కానుంది. జులై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఆసీస్ 5 సార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకోగా..భారత్, విండీస్ చెరో రెండుసార్లు కైవసం చేసుకున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ చెరో సారి ప్రపంచకప్‌ను ముద్దాడాయి. మరి 12వ వరల్డ్‌కప్ విజేత ఎవరో తెలుసుకోవాలంటే జులై 14 వరకు వేచి చూడాల్సిందే.