గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ నాథన్ కౌల్టర్‌నైల్ ఇన్నింగ్స్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఒక మంచి ఇన్నింగ్స్‌గా క్రికెట్ ప్రియులు గుర్తుంచుకుంటారు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఓ టెయిలెండర్ ఇలా అసాధారణ ప్రదర్శన చేయడం చాలా అరుదు. అదీ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో.
79/5తో కంగారూ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ దశలో 288 పరుగులు చేసిందంటే కారణం కౌల్టర్‌నైల్ ఇన్నింగ్సే. కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహకారంతో.. గొప్ప ప్రదర్శన చేశాడీ టెయిలెండర్ బ్యాట్స్‌మన్. అతడు క్రీజులోకి వచ్చే సమయానికి జట్టు స్కోరు 147/6. అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్ చేరారు. ఈ దశలో బౌండరీలతో విరుచుకుపడ్డాడీ పేసర్.
8 ఫోర్లు, 4 సిక్సర్లతో కేవలం 60 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు కౌల్టర్‌నైల్. ఇది అతని వ్యక్తిగత అత్యుత్తమం మాత్రమే కాదు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మన్ చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే కావడం విశేషం.
2015 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియాలోని నెం.8 బ్యాట్స్‌మన్ సగటు స్కోరు 16.3 మాత్రమే ఉందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.