ప్రపంచకప్.. కాదు.. అసలు క్రికెట్ అనగానే.. బౌలర్లు, బ్యాట్స్మెన్ల ప్రదర్శనే ఎక్కువగా గుర్తుకొస్తుంది. బ్యాట్స్‌మెన్ స్కోరు వేగం పెంచితే.. బౌలర్లు పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేస్తారు. ఈ స్కోరు కట్టడిలో ముఖ్యపాత్ర పోషించేది ఫీల్డర్లే. ఔట్ ఫీల్డ్‌లో దూకుడుగా కదులుతూ గేమ్‌లో కీలకంగా వ్యవహరిస్తారు. మరి మెగాటోర్నీలో సీజన్ ప్రకారం ఎవరు ఎక్కువ క్యాచ్‌లు పట్టారో చుద్దామా!
క్లైవ్ లోయడ్..4
1975 లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఆటగాడు క్లైవ్ అత్యధికంగా నాలుగు క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచింది కరేబియన్ జట్టు.
ఆసీఫ్ ఇక్బాల్(పాకిస్థాన్), అల్విన్ కాళీచరణ్(వెస్టిండీస్)..4
1979లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఇద్దరు ఆటగాళ్లు చెరో నాలుగేసి క్యాచ్‌లు అందుకుని ముందంజలో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఆసిఫ్ ఇక్బాల్, విండీస్ ఆటగాడు కాళీ చరణ్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీలో విండీస్ రెండోసారి కప్పు చేజిక్కించుకుంది.
కపిల్‌దేవ్(భారత్).. 7
1983 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ కపిల్‌దేవ్ అత్యధికంగా ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు. విండీస్‌తో జరిగిన ఫైనల్లో రిచర్డ్స్ క్యాచ్ కూడా ఇందులో ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ మొదటి సారి ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలోనే కపిల్ జింబాబ్వేపై 175 పరుగులతో మరచిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు.
కపిల్ వన్స్‌మోర్.. 5
1983లో ఏడు క్యాచ్‌లతో ఆకట్టుకున్న కపిల్ మరోసారి విజృంభించాడు. 1987 ప్రపంచకప్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. ఏడు మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తొలిసారి విజేతగా నిలిచింది.
కెప్లర్ (దక్షిణాఫ్రికా)..7
1992 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెప్లర్ అత్యధికంగా ఏడు క్యాచ్‌లు పట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్.. ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ వరల్డ్‌కప్‌తోనే దక్షిణాఫ్రికా పునఃప్రవేశం చేసింది.
అనిల్‌కుంబ్లే(భారత్)..8
1996 ప్రపంచకప్‌ను భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో అనిల్ కుంబ్లే అత్యధికంగా 8 క్యాచ్‌లు అందుకున్నాడు. అప్పటివరకు ఇదే రికార్డు. ఈ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక తొలిసారి విశ్వవిజేతైంది.
డారిల్ కల్లినన్(దక్షిణాఫ్రికా)..8
1999 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డారిల్ 9 మ్యాచుల్లో 8 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ టైగా ముగిసింది. లీగుల్లో నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. ఈ వరల్డ్‌కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి కప్పు రెండోసారి కైవసం చేసుకుంది ఆసీస్.
రికీ పాంటింగ్(ఆసీస్)..11
ప్రపంచకప్లన్నింటిలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా పాంటింగ్ రికార్డు సృష్టించాడు. 2003 మెగాటోర్నీలో 11 మ్యాచుల్లో 11 క్యాచ్‌లు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
పాల్ కాలింగ్‌వుడ్(ఇంగ్లాండ్)..8
2007 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు కాలింగ్‌వుడ్ అత్యధికంగా 8 క్యాచ్‌లు అందుకున్నాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో శ్రీలంకను ఓడించి ఆస్ట్రేలియా నాలుగోసారి వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గింది. వరుసగా మూడు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది.
మహేలా జయవర్ధనే(శ్రీలంక) ..8
2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే 8 క్యాచ్‌లు అందుకున్నాడు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ రెండో సారి టైటిల్ నెగ్గింది. 28 సంవత్సరాలు విశ్వవిజేతగా నిలిచింది.
రీలే రసో(దక్షిణాఫ్రికా).. 9
2015 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రసో అత్యధికంగా 9 క్యాచ్‌లు అందుకున్నాడు. 6 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై పరాజయం చెందింది దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి కంగారూ జట్టు ఐదో సారి ప్రపంచకప్ సొంతం చేసుకుంది.
అత్యధిక క్యాచ్‌లు రికీ పాంటింగ్(11) అందుకోగా.. క్లైవ్ లోయడ్(4) తక్కువ క్యాచ్‌లు పట్టుకున్నాడు. క్లైవ్తో పాటు ఆసిఫ్, కాళీ చరణ్ కూడా సమానంగా ఉన్నారు. ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు జరగ్గా.. ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచింది. భారత్, విండీస్ చెరో రెండు సార్లు.. శ్రీలంక, పాకిస్థాన్ చెరోసారి టైటిల్ నెగ్గాయి.