ప్రపంచకప్, ఆసియాకప్, ముక్కోణపు సిరీస్ ఇలా టోర్నీ ఏదైనా.. భారత జట్టు అనగానే అందరికీ గుర్తొచ్చేది పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్... నిజానికి ఎప్పటి నుంచో మన జట్టు బలం కూడా అదే. బౌలింగ్ ఎలా ఉన్నా... అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సాధించింది మెన్ ఇన్ బ్లూ. సునీల్ గావాస్కర్ నుంచి సచిన్ తెందుల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ దాకా ప్రతి ఒక్కరు తమ బ్యాటింగ్ నైపుణ్యంతోనే జట్టుకు ఎన్నో అపూర్వ విజయాలు అందించారు. 2011 ప్రపంచకప్‌లోనూ భారత్.. బ్యాటింగ్‌తోనే కప్పు నెగ్గిందనడంలో సందేహమే లేదు.
అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. కోహ్లి, రోహిత్, ధావన్, ధోని, పాండ్యా, రాహుల్, జాదవ్‌తో కూడిన దుర్భేధ్యమైన బ్యాటింగ్ బృందం ప్రత్యర్థిని భయపెడుతుందని భావించారు అంతా..! వారి ప్రదర్శన ఎలా ఉన్నా... భారత బౌలింగ్ దళం మాత్రం ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రాతో పాటు షమీ, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్ యాదవ్‌లు టోర్నీ ఆసాంతం అదరగొడుతున్నారు. పిచ్ ఏదైనా.. బ్యాట్స్‌మెన్ ఎవరైనా.. లక్ష్యం ఎంత చిన్నదైనా... ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ తామున్నామనే భరోసాను నింపుతున్నారు.
దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ నుంచి మొదలుపెడితే మొన్న జరిగిన విండీస్ మ్యాచ్ వరకు జట్టు విజయంలో బౌలర్లే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో చివరివరకు అలుపెరుగని పోరాటం చేసి జట్టుకు విజయాన్నందించారు. దక్షిణాఫ్రికా, విండీస్, దాయాది పాకిస్థాన్‌తో జరిగిన పోరులోనూ తమదైన ముద్రవేసి జట్టును అజేయంగా నిలిపారు. ముఖ్యంగా బుమ్రా.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ తనస్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఆసీస్ మాత్రమే..
ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్ 6 మ్యాచ్‌లు ఆడింది. అందులో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగతా 5 మ్యాచ్‌ల్లో కేవలం ఆస్ట్రేలియా(316/10) మాత్రమే కోహ్లీసేనపై 300 పైచిలుకు పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా (227/9), పాకిస్థాన్ (212/6), అఫ్గానిస్థాన్ (213/10), వెస్టిండీస్ (143/10) జట్లను 250లోపు స్కోరుకే నిలువరించగలిగారు మన బౌలర్లు. ఈ ఐదు మ్యాచుల్లో కలిపి భారత బౌలింగ్ బృందం 43 వికెట్లు తీసింది. ఇందులో బుమ్రా (9), భువనేశ్వర్ (5), షమీ (8), కుల్దీప్ యాదవ్ (4), చాహల్ (10), పాండ్యా (5), విజయ్ శంకర్ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
షమి వచ్చాడు.. హ్యాట్రిక్ తీశాడు
పాక్‌తో పోరులో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు ప్రధాన పేసర్ భువనేశ్వర్. భువి స్థానంలో జట్టులోకి వచ్చిన షమి... ప్రపంచకప్‌లో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగి హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. భారత్ తరఫున మెగాటోర్నీలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతే కాదు పసికూన అఫ్గాన్ చేతిలో ఓడిపోయే ప్రమాదం నుంచి జట్టును గట్టెక్కించాడు. ఆ తర్వాత విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజృంభించిన ఈ పేసర్ ఏకంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుని రెండు మ్యాచుల్లోనే 8 వికెట్లను పడగొట్టాడు. తాజాగా భువీ కూడా గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ తదుపరి సమరానికి సిద్ధమవడం కోహ్లీసేనకు శుభపరిణామమే..
ఇంతవరకు నో సెంచరీ...