ప్రపంచకప్‌లో బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించి ఘనంగా టోర్నీ నుంచి వైదొలిగింది దక్షిణాఫ్రికా జట్టు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో... 10 పరుగుల తేడాతో నెగ్గింది సఫారీ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 325 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ వార్నర్ శతకంతో రాణించినా... 315 పరుగులకే ఆలౌటైంది ఆసీస్. ఫలితంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికే పరిమితమైంది. సఫారీ బ్యాట్స్‌మెన్, శతక వీరుడు డుప్లెసిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
వార్నర్ విజృంభణ...
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ ప్రపంచకప్‌లో మరో శతకాన్ని నమోదు చేశాడు. 39 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ విధ్వంసకర ఆటగాడు... 122 పరుగులు ( 117 బంతుల్లో; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా ఈ ప్రపంచకప్‌లో మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 17వ సెంచరీ చేసి... ఆసీస్ మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (16) పేరిట ఉన్న శతకాల రికార్డును అధిగమించాడు.
మరో ఎండ్‌లో సహచరులు వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. వార్నర్ తనదైన ఆటతీరుతో జట్టును విజయపుటంచుల వరకు తీసుకెళ్లాడు. ఫించ్(3), ఖవాజా(18), స్మిత్(7), స్టోయినిస్(22), మాక్స్వెల్(12) పరుగులతో నిరాశపరిచారు. కీపర్ అలెక్స్ కేరీ (85 పరుగులు) చేసి వార్నర్‌కు మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7 ఓవర్ల వ్యవధిలో వీరిద్దరి వికెట్లతో సహా కమిన్స్ ఔటవడం వల్ల జట్టు కష్టాల్లో పడింది. చివర్లో స్టార్క్ కొంచెం శ్రమించినా ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు, ప్రిటోరియస్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తాహిర్, మోరిస్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.