తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్ వీర బాదుడికి.. బంగ్లా బెంబేలు!

నాటింగ్​హామ్ వేదికగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీతో విజృంభించగా.. ఫించ్​, ఖవాజా అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్ సౌమ్యా సర్కార్ మూడు వికెట్లు తీశాడు.

వార్నర్

By

Published : Jun 20, 2019, 7:01 PM IST

Updated : Jun 20, 2019, 7:16 PM IST

ప్రపంచకప్​లో భాగంగాబంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నాటింగ్​హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్​(166, 147 బంతుల్లో) శతకంతో రెచ్చిపోగా.. ఖవాజా(89), ఆరోన్ ఫించ్(53) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

బంగ్లా బౌలర్లు.. ఆసీస్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సౌమ్యా సర్కార్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు వార్నర్- ఫించ్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. అర్ధశతకం చేసి సౌమ్యా సర్కార్ బౌలింగ్​లో ఔటయ్యాడు ఫించ్​.

శతకంతో రెచ్చిపోయిన వార్నర్​

నిదానంగా ఇన్నింగ్స్​ ప్రారంభించిన డేవిడ్ వార్నర్ అనంతరం తనదైన శైలిలో దూకుడు పెంచాడు. 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని కెరీర్​లో 16వ శతకాన్ని నమోదు చేశాడు. వంద పరుగుల మైలురాయి తర్వాత మరింత విజృంభించాడు . ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 147 బంతుల్లో 166 పరుగులు చేసి సౌమ్యా సర్కార్​ బౌలింగ్​లో రుబెల్​కు క్యాచ్​ ఇచ్చాడు.

ఖవాజా అర్ధశతకం

ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఖవాజా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. వార్నర్​తో కలిసి 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 72 బంతుల్లో 89 పరుగులు చేసి సౌమ్యా సర్కార్​ బౌలింగ్​లోనే పెవిలియన్ చేరాడు.

చివర్లో ధాటిగా ఆడిన మాక్సీ..

ఆసీస్​ బ్యాట్స్​మెన్ మాక్స్​వెల్ చివర్లో వేగంగా ఆడాడు. 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఉన్నంతసేపు బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు.
మాక్స్​వెల్​ ఔటైన తర్వాత ఆసీస్​ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. వెంటవెంటనే ఖవాజా, స్మిత్(1) ఔట్​ కాగా.. చివర్లో స్కోరు కాస్త తగ్గింది.

చివరి ఓవర్​ ముందు మ్యాచ్​ను వర్షం కాసేపు అడ్డుకుంది. అనంతరం ప్రారంభం కాగా.. ఆ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెండు ఫోర్లు సహా 13 పరుగులు ఇచ్చాడు.

ఇది చదవండి: టీమిండియాను వదలని గాయాల బెడద!

Last Updated : Jun 20, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details