భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గ్యారేజీలోకి ఇటీవలే కొత్త వాహనం చేరింది. భారత సైనికులు ఉపయోగించే 'నిసాన్ జోంగా' మోడల్ జీపును మహేంద్రుడు కొనుగోలు చేశాడు. తనకి కార్లు, బైక్‌లు అంటే ఎంత మక్కువో చెప్పేందుకు తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు మహీ. అందులో కూతురు జీవాతో కలిసి సొంతంగా కారును క్లీన్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బాగు చేసేస్తాడు..
ధోనీ బైకులు నడపడమే కాదు వాటి రిపేర్ కూడా చేసుకుంటాడు. గతంలో వాటికి సంబంధించిన ఫొటోలనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. రైడింగ్లు, బైక్ ఫెస్టివల్స్‌లో పాల్గొనడం ధోనీకి మహా ఇష్టమట. ఈ స్టార్ క్రికెటర్ వద్ద రకరకాల బైకులతో పాటు వింటేజ్ వాహనాలు కూడా ఉన్నాయి. ఫెరారీ 599 జీటీవో, హమ్మర్ హెచ్2 వంటి ఉన్నత స్థాయి కార్లతో పాటు కవాసకీ నింజా, బీఎస్ఏ, సుజుకీ హయాబుసా లాంటి ద్విచక్ర వాహనాలూ ఉన్నాయి.
వీడ్కోలు సమాచారం..
ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే కొంత కాలంగా ఈ సీనియర్ క్రికెటర్ వీడ్కోలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టని మహీ.. భారత ఆర్మీకి సేవలందించేందుకు రెండు నెలల పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. ఇందులో భాగంగానే విండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు దూరమయ్యాడు.