తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ఓపెనింగ్ చేయడానికి అతడే కారణం'

ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టీ20లో కోహ్లీ ఓపెనింగ్ చేయడానికి యువ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్ కారణమని తెలిపాడు టీమ్ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్. సూర్య మూడో స్థానంలో రాణించడం వల్లే కోహ్లీ ఓపెనర్​గా బరిలో దిగాడని వెల్లడించాడు.

Virat Kohli
కోహ్లీ

By

Published : Mar 22, 2021, 1:01 PM IST

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా కొత్త చర్చకు తెరలేపింది. అదే రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ కాంబినేషన్‌. ఎప్పుడూ లేని విధంగా వీరిద్దరూ ఐదో టీ20లో అనూహ్యంగా ఓపెనింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ వ్యూహాత్మక చర్య ఫలించడమే కాకుండా జట్టుకు కొత్త భరోసానిచ్చింది. అలాగే, కెప్టెన్‌ కోహ్లీ కూడా భవిష్యత్‌లో హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం వల్ల ఇప్పుడీ విషయంపై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే, కోహ్లీ-రోహిత్‌ ఓపెనింగ్‌ చేయడానికి యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవే ముఖ్య కారణమని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అతడు ఇలా స్పందించాడు.

"ఎవరైనా.. విరాట్‌ కోహ్లీ ఇలా వచ్చి అలా ఎలా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని, అదెలా సాధ్యమని ముందుగా ప్రశ్నించుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ లాంటి యువ బ్యాట్స్​మన్ టీమ్ఇండియాకు దొరకడమే అందుకు సమాధానం. ఈ కొత్త కుర్రాడు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి తానేం చేయగలడో నిరూపించాడు. ఈ ఆలోచనే కోహ్లీ ఓపెనింగ్‌ చేయడానికి ఉపకరించి ఉండొచ్చు. అది మంచి ఫలితం తీసుకురావడం వల్ల కోహ్లీ కూడా రోహిత్‌తో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్‌ అయ్యర్‌ మరింత కిందకు వెళ్లాడు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్‌ చేయడం మంచిదని కోహ్లీ భావించి ఉండొచ్చు."

-జహీర్ ఖాన్, టీమ్ఇండియా మాజీ పేసర్

కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా.. సూర్యకుమార్‌, ఇషాన్‌కిషన్‌ లాంటి ఇద్దరు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమిచ్చింది. దీంతో వారిద్దరూ సత్తాచాటి భవిష్యత్‌ ఆశాకిరణాలుగా నిలిచారు. మున్ముందు కూడా వారిద్దరు ఇలాగే ఆడితే, కోహ్లీ ఓపెనింగ్‌ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.

ABOUT THE AUTHOR

...view details