2007 టీ20 ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని విధంగా టీమ్ఇండియా విజేతగా నిలిచింది. టీ20 ఫార్మాట్లో అదే తొలి వరల్డ్ కప్ కావడం.. జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారడం వల్ల ధోనీసేనపై అభిమానుల్లో అంతగా అంచనాలేవీ లేదు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలిచి జోష్‌ను మరింత పెంచింది. అయితే ఈ ఫైనల్లో చివరి ఓవర్ వేసి జట్టుకు విజయాన్నందించిన జోగీందర్ శర్మను క్రికెట్ అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈరోజు అతడి పుట్టినరోజు సందర్భంగా మాజీ క్రికెటర్ యువరాగ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
"డీఎస్పీ సాబ్.. 2007లో నువ్వు వేసిన ఒక్క ఓవర్.. 2007లో చరిత్ర సృష్టించింది. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు"
-యువరాజ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఏం జరిగింది?
2007 సెప్టెంబర్ 24. భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 5 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు చేసింది. గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులతో సత్తాచాటాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఇండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
చేధనలో పాకిస్థాన్ చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ.. హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్‌ను కాదని జోగిందర్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఆ ఓవర్లో సిక్సు బాది భారత అభిమాలను కలవరపెట్టిన మిస్బా ఉల్ హక్.. తర్వాత స్కూప్ షాట్ ఆడి శ్రీశాంత్ చేతికి చిక్కాడు. దీంతో ఇండియా ఇంకా మూడు బంతులు మిగిలుండగానే విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ టోర్నీలో జోగిందర్ నాలుగు మ్యాచ్‌లాడి నాలుగు వికెట్లు తీశాడు. ఈ ఫైనల్ తర్వాత ఒక్క టీ20 కూడా ఆడలేదు. ప్రస్తుతం ఇతడు హరియాణా పోలీసు శాఖలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.