క్రికెట్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులను సంతరించుకుంది. పది రోజుల క్రికెట్ నుంచి ఐదు రోజుల టెస్టుల వరకు.. వన్డేల నుంచి (టీ20) పొట్టి ఫార్మాట్ వరకు రూపాంతరం పొందుతూ వచ్చింది. ఇటీవలే టీ10, ది హండ్రెడ్ లీగ్ వంటి వినూత్న ఫార్మాట్లతో క్రీడాప్రేమికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇదే నేపథ్యంలో ఈ జెంటిల్మెన్ గేమ్‌లో మరో కొత్త విధానం రానుంది. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు చూడని కొత్త ఫార్మాట్ అది. దీని పేరు అల్టిమేట్ క్రికెట్ ఛాలెంజ్. ప్రపంచ క్రికెట్లోని ఆరుగురు ఆటగాళ్లతో ఈ లీగ్ జరగనుంది. డిసెంబరు 24 నుంచి జనవరి 1వరకు జరగనుంది.
అల్టిమేట్ క్రికెట్లో భాగం కానున్న క్రికెటర్లు ఆ ఆరుగురు క్రికెటర్లు!
అల్టిమేట్ క్రికెట్ ఛాలెంజ్‌లో దిగ్గజ క్రికెటర్లైన యువరాజ్ సింగ్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్(ఇంగ్లాండ్), ఆండ్రీ రస్సెల్, క్రిస్ గేల్(వెస్టిండీస్), రషీద్ ఖాన్(అఫ్గానిస్థాన్) పాల్గొననున్నారు. ఇందులోని ప్రతి ఒక్క ఆటగాడు మిగిలిన ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది.
ఎలా ఆడాలి?
ఒక గేమ్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్‌లో 15 బంతులు వేయాలి. అలా ఒక్కో ఆటగాడు 30 బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లీగ్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఆడతారు. ఇందులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. గెలిచిన క్రికెటర్‌కు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. లీగ్ దశలో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 ఆటగాళ్లు సెమీఫైనల్‌కు చేరుతారు.
పరుగులు రాబట్టడం ఎలా?
ఆరు జోన్లుగా డివైడ్ చేసి జోన్ ఎ - 1 రన్, జోన్ బీ - 1 రన్, జోన్ సీ - 2 రన్స్, జోన్ డీ - 3 రన్స్, జోన్ ఈ - బౌన్స్‌తో వెళితే ఫోర్ రన్స్, జోన్ ఈ - నేరుగా వెళితే సిక్సర్.. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌కు బౌలర్ వెనకున్న బుల్స్ ఐని తాకితే 12 రన్స్ వస్తాయి. దీంతో పాటు ఒక బాల్ అదనంగా లభిస్తుంది. వికెట్లకు స్క్వేర్‌గా ఉండే బుల్స్ ఐని కొడితే 4 పరుగులు రాబట్టవచ్చు. బ్యాట్స్‌మన్ ఔటైతే వారు చేసిన రన్స్ నుంచి 5 పరుగులను కోత విధిస్తారు.
డిసెంబరు 24 నుంచి రాత్రి 9.30 గంటలకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 1న జరిగే ఫైనల్ ద్వారా ఉత్తమ క్రికెటర్ ఎవరో తేలుతుంది.
ఇదీ చూడండి:దేశవాళీ క్రికెట్‌తో యువీ, శ్రీశాంత్ రీఎంట్రీ