అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాలను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. దిగ్గజ సచిన్ తెందుల్కర్ తొలిసారి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తెగ సంతోషపడ్డాడని తెలిపాడు. ఎక్కడ ఆ అనుభూతిని కోల్పోతానేమోనని, తనకు స్నానమే చేయాలనిపించలేదని చెప్పాడు. మాస్టర్ బ్లాస్టర్ అనేక సందర్భాల్లో తనకు ప్రోత్సాహమందించాడని వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయిన 'స్టోరీస్ బిహైండ్ ది స్టోరీ' వీడియోలో యువీ ఈ విషయాల్ని తెలిపాడు.
"అండర్-19 ఆడిన తర్వాత సీనియర్ జట్టులో చోటు దక్కింది. నా హీరోలు సచిన్, గంగూలీ, ద్రవిడ్, కుంబ్లే, శ్రీనాథ్ లాంటి గొప్ప ఆటగాళ్లను చూసి.. నేనెక్కడ ఉన్నానో అని ఆశ్చర్యపోయాను. ఓ సందర్భంలో అందరం బస్సులో వెళ్తున్నాం. నేనేమో వెనుక సీటులో కూర్చున్నాను. అప్పుడే కొత్తగా జట్టులోకి చేరిన నన్ను.. జహీర్ ఖాన్, విజయ్ దహియా, సచిన్ వెనక్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వారివారి సీట్లోకి వెళ్లిపోయారు. వెంటనే ఆనందంతో నా చేతులను ఒళ్లంతా రుద్దుకున్నాను. ఆ తర్వాత స్నానం చేయొద్దని అనుకున్నాను"
-యువరాజ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.