టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. చాహల్ ఇటీవలే తన తండ్రితో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో గురించి యువీ స్పందించిన తీరుపై నెట్టింట విమర్శలు వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్. తాజాగా ఈ విషయంపై క్షమాపణలు చెప్పాడు యువీ.
"ఈ విషయంపై నేను క్లారిటీ ఇస్తున్నా. నేనెప్పుడూ కులం, రంగు, లింగ బేధాల గురించి మాట్లాడను. నా జీవితం మొత్తం ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తా. అలాగే ప్రతి ఒక్కరిని ఎటువంటి తారతమ్యాలు లేకుండా గౌరవిస్తా. అయితే నా స్నేహితులతో మాట్లాడే సమయంలో అనుకోకుండా తప్పుగా మాట్లాడవచ్చు. కానీ ఒకరి ఫీలింగ్స్‌ని దెబ్బతీయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. ఆ మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే క్షమాపణలు కోరుతున్నా."