టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శనివారం 39వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అతడికి తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రైతులు చేస్తోన్న ఆందోళనలు సద్దుమణగాలని, ప్రభుత్వంతో వారి చర్చలు ఫలప్రదం కావాలని కోరుతూ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో పంచుకున్న అతడు నెట్స్‌లో తనకిష్టమైన బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.
పుట్టినరోజు నాడు యూవీ నెట్స్‌లో సాధన చేశాడు. బ్యాట్‌పట్టి మళ్లీ షాట్లు ఆడాడు. ఈ సందర్భంగా బౌలర్ తలపై నుంచి బాదిన ఓ సిక్సర్ వీడియోను స్లో మోషన్‌లో చూపిస్తూ అభిమానులతో పంచుకున్నాడు.