ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ఫిబ్రవరి 8న ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించనుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇందులో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ మ్యాచ్‌లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల వీరుడు యువరాజ్ సింగ్ అంగీకరించాడు.
'బుష్ఫైర్ క్రికెట్ బాష్' పేరుతో జరగనున్న ఈ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ జట్టుకు సచిన్ తెందూల్కర్.. షేన్ వార్న్ జట్టుకు కోట్నీ వాల్ష్(వెస్టిండీస్) కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
ఎందరో ప్రముఖులు...
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, మాథ్యూ హెడెన్, ఆండ్రూ సైమండ్స్, బ్రాడ్ హడిన్, మైక్ హస్సీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖెల్ క్లార్క్, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్ బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు నాన్ ప్లేయింగ్ కెప్టెన్లుగా ఆసీస్ మహిళా క్రికెటర్ మేల్ జేన్స్, స్టీవ్ వా కూడా కనువిందు చేయనున్నారు.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నారు. ఇదే రోజున బిగ్‌బాష్ లీగ్ ఫైనల్, భారత్-ఆస్ట్రేలియా మధ్య మహిళల టీ20 మ్యాచ్ జరగనుంది.
కార్చిచ్చు బాధితుల కోసం ప్రస్తుత ఆసీస్ క్రికెటర్లు క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డార్సీ షార్ట్ కూడా తమ వంతు విరాళాలు ఇస్తామని ప్రకటించారు. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్న వీళ్లు.. లీగ్‌లో ఎన్ని సిక్సర్లు కొడితే ఒక్కోదానికి 17వేల రూపాయలతో గుణించి ఆ మొత్తాన్ని అందజేస్తామని ప్రకటించారు.