'ఆరు బంతుల్లో ఆరు సిక్సులు' అంటే టక్కున గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. టీమిండియా తరఫున, 2007 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఈ రికార్డు సృష్టించాడు. ఇటీవలే ఆ ఘనతకు 13 ఏళ్లు అయిన సందర్భంగా తిరిగి వాటిని గుర్తు చేసుకున్నాడు ఈ మాజీ ఆల్రౌండర్. ఆ మ్యాచ్ అయిన తర్వాత బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రితో ఈ విషయం గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు.
'ఆరు సిక్సులు' తర్వాత బ్రాడ్ తండ్రితో యువీ చర్చ - 2007 టీ20 ప్రపంచకప్ యువరాజ్ సింగ్
'ఆరు బంతుల్లో ఆరు సిక్సులు' ఘనత సాధించిన తర్వాత బౌలర్ బ్రాడ్ తండ్రికి, తనకు మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.
"క్రిస్ బ్రాడ్(స్టువర్ట్ బ్రాడ్ తండ్రి) మ్యాచ్ అయిన తర్వాత రోజు నా దగ్గరకు వచ్చారు. తన కుమారుడి కెరీర్ దాదాపు ముగిసేలా చేశావు. అతడి కోసం ఓ షర్టుపై సంతకం చేసి ఇవ్వు అని అడిగారు. దాంతో నేను భారత జెర్సీపై సంతకం చేసి, దానితో పాటే ఓ సందేశం రాసి ఇచ్చా. 'నేను ఆరు సిక్సర్లు కొట్టా. బౌలర్గా నువ్వు ఎలా ఫీలవుతావో నాకు తెలుసు. నీ కెరీర్ కోసం ఆల్ ద బెస్ట్'అని రాశాను" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్
అయితే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో బ్రాడ్ ఒకడని చెప్పిన యువీ.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా అతడి కెరీర్ కొనసాగుతుండటం సాధారణ విషయం కాదని చెప్పాడు.