ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్‌గా ఇటీవల రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో భాగంగా ఐదురోజున ఈ ఘనత సాధించాడు. దీంతో పలువురు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. అండర్సన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
"చారిత్రక మైలురాయిని అందుకున్నందుకు శుభాకాంక్షలు జిమ్మీ. నీ తెగువ, పట్టుదలే ఈ అసాధ్యమైన ఘనతను సాధించేలా చేశాయి. నువ్వు మరిన్ని రికార్డులు సృష్టించాలి" అంటూ ట్వీట్ చేశాడు.
అయితే బుమ్రా ట్వీట్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ వైవిధ్య బౌలర్‌కి ఓ ఛాలెంజ్ విసిరాడు. "నువ్వు కనీసం 400 వికెట్లయినా తీయాలి" అంటూ బుమ్రాకు సూచించాడు. అండర్సన్‌ను కూడా యువీ మెచ్చుకున్నాడు.
"ఓ ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో 600 వికెట్లు సాధిస్తాడని నా జీవితంలో అనుకోలేదు. ఎంతో నాణ్యతతో కూడిన బౌలింగ్ చేస్తేగానీ ఇలాంటి ఘనత సాధ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే ఉత్తమ బౌలర్ జిమ్మీ" అంటూ కొనియాడాడు.
బుమ్రా ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 20.3 సగటుతో 68 వికెట్లు తీశాడు. 64 వన్డేల్లో 24.4 సగటుతో 104 వికెట్లు సాధించాడు. 50 టీ20ల్లో ఆడిన బుమ్రా 59 వికెట్లు పడగొట్టాడు.