వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ-ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు భారత్ 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్‌తో మొదలవుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టనుంది టీమిండియా. ఆదివారం అరుణ్ జైట్లీ మైదానంలో (ఫిరోజ్‌షా కోట్లా) సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్‌శర్మ సారథ్యంలో కుర్రాళ్లతో బరిలో దిగుతోంది టీమిండియా. ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్ భీకర ఫామ్‌లో ఉండగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ సిరీస్‌తో తిరిగి గాడిలో పడాలని అనుకుంటున్నాడు. ప్రపంచకప్ తర్వాత పెద్దగా ఆకట్టకోలేకపోయాడు శిఖర్.
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కృణాల్ పాండ్య, రిషబ్‌పంత్ లాంటి ఆటగాళ్లతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న ముంయి ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
సీనియర్ బౌలర్ల గైర్హాజరీతో మహ్మద్ ఖలీల్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. స్పిన్ విభాగంలో యజువేంద్ర చాహల్ ఈ సిరీస్‌లో చక్కటి ప్రదర్శన చేసి మళ్లీ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. మరో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ లేదా రాహుల్ చాహర్‌లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ప్రాక్టీస్ చేస్తున్న ధావన్ చిట్టగాంగ్ టెస్టులో అప్గానిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత ఆడిన నాలుగు టీ-ట్వంటీల్లో 3 విజయాలతో దూకుడు మీదున్న బంగ్లాదేశ్‌కు సారథి షకీబుల్ హసన్‌పై ఐసీసీ వేటుపడడం పెద్ద ఎదురు దెబ్బే. ఈ పరిస్థితుల్లో మహ్మదుల్లా రియాద్ సారథ్యంలో తలపడనుంది బంగ్లా జట్టు. ముష్ఫికర్ రహీమ్, సౌమ్యసర్కార్, లిటన్దాస్పై బ్యాటింగ్ భారం పడనుంది.
మ్యాచ్ జరగనున్న ఫిరోజ్‌షా కోట్ల మైదానంపై కాలుష్య మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. దీపావళి తర్వాత హస్తినలో అతితీవ్ర కాలుష్యం నెలకొనగా మ్యాచ్ వేదిక మార్చాలంటూ డిమాండ్లు వచ్చినా బీసీసీఐ వెనక్కి తగ్గకుండా కోట్లాలోనే నిర్వహిస్తోంది. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం ఉదయానికి కాలుష్య తీవ్రత తగ్గడం కాస్త ఊరటనిస్తోంది.
ఇదీ చదవండి: ధోనీ, కోహ్లీ రికార్డులపై హిట్‌మ్యాన్ కన్ను