బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్.. పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి ఆశ్చర్యపర్చాడు. హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకుని ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ జరిగి మూడురోజులైనా కాకముందే మరో హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు.
ఈసారి దేశవాళీ..
అప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటితే.. తాజాగా జాతీయ టీ20 ముస్తాక్ అలీ టోర్నీలో ఈ గణాంకాలు నమోదు చేశాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం(నవంబర్ 12) రాజస్థాన్, విదర్భ జట్ల మధ్య దేశవాళీ టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో 3 ఓవర్లు వేసిన దీపక్ చాహర్.. కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్, ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. ఫలితంగా రాజస్థాన్.. ప్రత్యర్థి విదర్భను 13 ఓవర్లలో 99 పరుగులకే కట్టడి చేసింది. అయితే వీజేడీ పద్ధతి ప్రకారం 13 ఓవర్లలో 107 లక్ష్యం నిర్దేశించగా.. 105 రన్స్‌కే పరిమితమైంది రాజస్థాన్. ఫలితంగా చాహర్ హ్యాట్రిక్ తీసినా తన జట్టు ఓటమిపాలైంది.