మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై మరోసారి స్పందించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 'మీరు ఎప్పటికీ నా కెప్టెనే' అంటూ ఓ వీడియోలో వెల్లడించాడు. ధోనీ నుంచి తనకు లభించిన స్నేహానికి, నమ్మకానికి మాజీ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. క్రికెట్‌కు ధోనీ వీడ్కోలుపై విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న ఓ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).
"జీవితంలోని కొన్ని సందర్భాల్లో మాటలు రాని క్షణాలు ఉంటాయి. వాటిలో ఇదొక్కటని నేను అనుకుంటా. ధోనీ గురించి చెప్పాలంటే బస్సులోని చివరి సీట్లో కూర్చునే వ్యక్తి. మేమిద్దరం స్నేహంతో పాటు మంచి అవగాహనను పంచుకున్నాం. ఎందుకంటే మేము ఒకే లక్ష్యాల కోసం పనిచేశాం. అదే జట్టు విజయానికి కారణమైంది. మీతో(ధోనీ) కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. మీరు నాపై నమ్మకాన్ని చూపించారు. దీనికి మీకెంతగానో కృతజ్ఞతతో ఉంటా. గతంలో చెప్పిందే ఇప్పుడు చెబుతున్నా. మీరు(ధోనీ) ఎప్పుడూ నా కెప్టెన్‌గానే ఉంటారు."