దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత బ్యాటింగ్ సంచలనం యశస్వి జైశ్వాల్ అదరగొట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో అబ్బురపరుస్తున్న జైశ్వాల్.. బంగ్లాదేశ్తో ఫైనల్లో మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా సంచలనం జైశ్వాల్ రికార్డులే రికార్డులు
భారత యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్.. అండర్-19 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్తో జరుగుతున్న తుదిపోరులో పలు రికార్డులు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో జైశ్వాల్.. 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. 400 పరుగులతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు అర్ధశతకాలు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ బ్రెట్ విలియమ్స్(1988), భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(2016) పేరిట ఉన్న రికార్డును జైశ్వాల్ సమం చేశాడు. గత ఆరు మ్యాచుల్లో యశస్వి వరుసగా 57, 29*, 57*, 62, 105*, 88 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో 10 సిక్సులు బాదిన జైశ్వాల్.. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా మారాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాక్ బర్న్‌హమ్ (15 సిక్సులు 2016లో), భారత బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (12 సిక్సులు 2014లో) జైశ్వాల్ కంటే ముందున్నారు.