తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆకలి పోరాటాన్ని క్రికెట్​తో జయించిన యశస్వి - Yashasvi Jaiswal sell panipuri

విజయ్​ హజారె ట్రోఫీలో రికార్డు డబుల్​ సెంచరీ చేశాడు 17 ఏళ్ల క్రికెటర్​ యశస్వి జైస్వాల్. పిన్న వయసులోనే ప్రపంచ లిస్ట్-ఏ మ్యాచుల్లో ద్విశతకం బాదేశాడు. భారత్​ తరఫున ఈ ఫీట్​ సాధించిన ఏడో క్రికెటర్​గానూ పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి యువతేజం ప్రస్థానం చూద్దామా..

ఆకలి పోరాటాన్ని క్రికెట్​తో జయించిన యశస్వి

By

Published : Oct 17, 2019, 9:21 AM IST

యశస్వి జైస్వాల్​... ప్రస్తుతం దేశవాళీ క్రికెట్​లో మారుమోగుతున్న పేరు. 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించాడు. పిన్న వయసులోనే డబుల్​ సెంచరీ బాదేసిన ఈ యువతేజం.. ఎందరో ప్రముఖల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ విజయం వెనుక ఓ కన్నీటి గాథ ఉంది. ఒకప్పుడు కడుపు నిండా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డాడు. ఉండటానికి గూడు లేకపోతే ఎటువంటి వసతి లేని గుడారాల్లో నివసించాడు. తల్లిదండ్రుల అండ లేకుండానే ఓవైపు క్రికెట్‌ సాధన సాగిస్తూ.. ఇంకోవైపు ఖర్చుల కోసం పానీపూరీలు అమ్మాడు.

పానిపూరీ అమ్ముతూ..

ఇదీ అతడి ప్రయాణం...

ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన పేద కుటుంబం నుంచి వచ్చాడు యశస్వి. ఊహ తెలిసే సమయానికి అతడికి క్రికెట్‌ పిచ్చి పట్టేసింది. వయసు పెరిగే కొద్ది అది ఇంకా పెరిగింది. కానీ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్తోమత అతడికి లేదు. ఫలితంగా ఆట కోసమే ఊరు విడిచిపెట్టి ముంబయి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి పోషణ భారంగా మారడం వల్ల యశస్వి తండ్రి కూడా అతడికి అడ్డు చెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్‌ ఆడటం మొదలెట్టాడు. అయితే క్రికెట్‌ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడం లేదని అతడ్ని తప్పించారు.

పానీపూరీలు అమ్మి...

పని కోల్పోయిన యశస్వి.. అంత ఇబ్బందుల్లోనూ ఊరికెళ్లిపోలేదు. ఆజాద్‌ మైదానంలోని ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉండేవాడు. మూడేళ్లు అక్కడే ఉన్నాడు. అందులో కనీస వసతులు ఉండేవి కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్‌ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు. డబ్బులు సరిపోక కొన్నిసార్లు కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం విడిచిపెట్టలేదుయశస్వి. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు.

కోచ్​ బ్యాటింగ్​ సలహాలు, వసతుల్లోని గృహంలో, నెట్స్​ వద్దే తింటోన్న యశస్వి

మలుపు తిరిగింది..

యశస్వి గురించి జ్వాలా సింగ్‌ అనే కోచ్‌కు తెలియడం అతడి కెరీర్‌లో అతిపెద్ద మలుపు. ఎ-డివిజన్‌ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్న యశస్విని చూసిన ఆ శిక్షకుడు తన పర్యవేక్షణలో తర్ఫీదు ఇచ్చాడు. త్వరగానే ముంబయి అండర్‌-19 జట్టుకు ఎంపికైన యశస్వి.. గత ఏడాది శ్రీలంకలో పర్యటన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇందులో సచిన్​ తనయుడు అర్జున్​ తెందూల్కర్​తో కలిసి ఎంపికయ్యాడు.

ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన యశస్వి
  • శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్‌ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్‌-19 జట్టు ముక్కోణపు సిరీస్‌ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. ఇతడు ఉపయుక్తమైన స్పిన్నర్‌ కూడా. ప్రతి మ్యాచ్‌లోనూ అతను బౌలింగ్‌ చేస్తాడు.
  • విశాఖపట్నంలో జరిగిన విజ్జీ వన్డే ట్రోఫీలో 224 పరుగులు, 8 వికెట్లతో 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు. యశస్వి ముంబయి తరఫున రంజీల్లోనూ అరంగేట్రం చేశాడు.

ఈ యువ ఆటగాడి ప్రతిభను గుర్తించిన సచిన్​ తెందూల్కర్​... ఇంటికి పిలిచి తాను సంతకం చేసిన బ్యాట్​ను బహుమతిగా ఇచ్చి ప్రశంసించాడు.

సచిన్​ ఇచ్చిన బ్యాట్​తో యశస్వి

జాఫర్‌ను చూసి..

యశస్వి సత్తా చాటుతున్నా.. శుభారంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేని బలహీనత ఉండేది. ముంబయి దిగ్గజం వసీమ్‌ జాఫర్‌ను చూసి దాన్ని అధిగమించాడు. కేవలం జాఫర్‌ ఆట చూసే సుదీర్ఘ సమయం క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకున్నానని ఈ యువ క్రికెటర్​ చెప్పాడు.

టీమిండియాలో చోటు దక్కేనా?

టీనేజ్​లోనే దేశవాళీ క్రికెట్లో సంచలన ప్రదర్శన చేసి టీమిండియా తలుపులు తట్టిన ముంబయి ఆటగాళ్లు సచిన్‌, కాంబ్లి, పృథ్వీ షాల సరసన యశస్వి చేరుతాడన్నది క్రికెట్‌ పండితుల అంచనా. యశస్వి బ్యాటింగ్‌ శైలి, అతడి నైపుణ్యం, నిలకడ చూసి కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఊపును కొనసాగిస్తే.. భారత జాతీయ జట్టు తరఫున ఆడాలన్న కలను యశస్వి నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు.

ABOUT THE AUTHOR

...view details