తెలంగాణ

telangana

ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం.. ఫొటో​ చూశారా?

By

Published : Jan 18, 2020, 11:48 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియం గుజరాత్​లోని అహ్మదాబాద్​లో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ మైదానానికి సంబంధించి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తాజాగా స్టేడియం ఫొటోను అభిమానులతో పంచుకుంది ఐసీసీ. ఈ స్టేడియంలో ఒకేసారి లక్షా పదివేల మంది కూర్చొని మ్యాచ్​ చూసే వీలుంది.

World's Biggest Cricket Stadium Motera
భారత్​లోనే ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం... ఫొటో​ చూశారా?

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియం(మోటేరా స్టేడియం) త్వరలోనే అరుదైన ఘనత సాధించబోతోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈ మైదానం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా గుర్తింపు తెచ్చుకోనుంది. అహ్మదాబాద్‌లోని మోటేరా ప్రాంతంలో ఉన్న ఈ స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దీని ఫొటోను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ). ఇది ఆస్ట్రేలియా మెల్​బోర్న్ స్టేడియం​ కంటే పెద్దది. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ దీన్ని పర్యవేక్షిస్తోంది.

ఐసీసీ షేర్​ చేసిన ఫొటో

2015 నుంచే నిర్మాణం..!

పాత మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఈ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్‌ వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గవాస్కర్‌ ఈ స్టేడియంలోనే... టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇదే మైదానంలో తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.

2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది.

మోటేరా స్టేడియం

ABOUT THE AUTHOR

...view details