కొవిడ్-19 కారణంగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆగిపోయింది. వాయిదా వేసిన మ్యాచులను తిరిగి నిర్వహిస్తారన్న హామీ లేదు. ఈ నేపథ్యంలో నిర్దేశిత సమయంలోనే ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీ ఓ అనూహ్య నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం. ఆగిపోయిన సిరీసులకు సంబంధించిన పాయింట్లను నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం పంచాలని భావిస్తున్నట్టు తెలిసింది.
టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ఐసీసీ అనూహ్య నిర్ణయం! - team india news
టెస్టు ఛాంపియన్‌షిప్ విషయమై ఐసీసీ అనూహ్య నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఆగిన మ్యాచ్‌లకు సంబంధించిన పాయింట్లను ఇరుజట్లకు పంచేయాలని భావిస్తోంది.
టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 జూన్‌లో పూర్తికావాలి. ఛాంపియన్‌షిప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. లార్డ్స్‌లో ఫైనల్ ఆడతాయి. కరోనాతో మ్యాచులన్నీ వాయిదా పడ్డాయి. కొన్నాళ్ల క్రితం వెస్టిండీస్, పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ టెస్టు సిరీసులు నిర్వహించింది. యూఏఈలో ఐపీఎల్ పూర్తయ్యాక ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించనుంది. ఇవి కాకుండా ప్రధాన దేశాల మధ్యే బయో బడుగలో మ్యాచులు జరిగే అవకాశం ఉంది. మిగిలిన దేశాల్లో నిర్వహించడం కష్టం. కాబట్టి ఆ మ్యాచులకు పాయింట్లు పంచాలని ఐసీసీ అనుకుంటోంది.
నిబంధనల ప్రకారం ఒక టెస్టు సిరీస్‌కు 120 పాయింట్లు ఉంటాయి. రెండు మ్యాచులంటే ఒక్కో మ్యాచుకు 60 పాయింట్లు, మూడు ఉంటే 40, నాలుగుంటే 30 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రెండు మ్యాచుల సిరీసులో ఏదైనా జట్టు మ్యాచు గెలిస్తే 60 పాయింట్లు లభిస్తాయి. డ్రా చేసుకుంటే చెరో 30 పాయింట్లు లభిస్తాయి. కరోనా వల్ల ఆగిపోయిన సిరీసులను డ్రాగా భావిస్తూ రెండు జట్లకు 1/3వ వంతు పాయింట్లను పంచాలని ఐసీసీ భావిస్తోందట. మే తర్వాత ఏ జట్లు తొలి రెండు స్థానాల్లో ఉంటే వారికి ఫైనల్ నిర్వహిస్తారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.