తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 మహిళా ప్రపంచకప్​లలో మెరికలు

ఈ ఏడాది టీ20 మహిళా ప్రపంచకప్​లో టీమిండియా తొలిసారి ఫైనల్ చేరింది. బ్యాటింగ్​లో షెఫాలీ వర్మ, బౌలర్లలో రాధా యాదవ్ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇలా భారత మహిళా జట్టు సత్తాచాటిన ప్రతిసారి ఆకట్టుకున్న మహిళా క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.

టీ20
టీ20

By

Published : Mar 6, 2020, 6:45 AM IST

Updated : Mar 6, 2020, 7:16 AM IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 మహిళా ప్రపంచకప్​లో టీమిండియా సత్తాచాటుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్​ల్లో గెలిచిన హర్మన్ సేన సెమీస్​కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఘనత వహించింది. కానీ ఇంగ్లాండ్​తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్లు ఎక్కువ ఉన్న కారణంగా నేరుగా ఫైనల్​కు అర్హత సాధించింది భారత్. అయితే ఈ టోర్నీలో ఆద్యంతం భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ, స్పిన్నర్ రాధా యాదవ్. మొత్తంగా ఈ మెగాటోర్నీల్లో సత్తాచాటిన భారత మహిళా క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.

మహిళా టీ20 ప్రపంచకప్ -2020 (ఆస్ట్రేలియా)

ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఎక్కువగా వినపడుతోన్న యువ సంచలనం పేరు షెఫాలీ వర్మ. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుగాడికి దిగుతోన్న షెఫాలీ వేగంగా పరుగులు సాధిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్​లలో 29(15), 39 (17), 46 (34), 47 (34) పరుగులు చేసింది. ఈ టోర్నీలో 161 రన్స్​తో అత్యధిక పరుగుల మహిళల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్​కు చెందిన నటాలియా సీవర్ (202), హేదర్ నైట్ (193) ముందున్నారు. ఇంగ్లాండ్ సెమీస్​లోనే వెనుదిరగడం వల్ల అత్యధిక పరుగులు సాధించేందుకు షెఫాలీకే ఎక్కువ అవకాశం ఉంది.

బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ సత్తాచాటుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 వికెట్లు సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 19 రన్స్ ఇచ్చి 4 వికెట్లు సాధించింది. ఈ ప్రదర్శన చాలా కాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. శిఖా పాండే కూడా మంచి ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 7 వికెట్లు సాధించింది. ఈ ముగ్గురు ఫైనల్లోను ఇదే ప్రదర్శనను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మహిళా టీ20 ప్రపంచకప్ -2018 (వెస్టిండీస్)

2018 ఎడిషన్​లో హర్మన్​ప్రీత్ కౌర్, స్మృతి మంధాన బ్యాట్​తో రాణించారు. కెప్టెన్ హర్మన్ ఈ టోర్నీలో ఓ సెంచరీతో పాటు 45.75 సగటుతో మొత్తం 183 పరుగులు చేసింది. ఇక మంధాన 35.60 సగటుతో 178 రన్స్ చేసింది. వీరి బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా సెమీస్​కు చేరగలిగింది. అయితే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ మెగాటోర్నీలో హర్మన్, స్మృతి అత్యధిక పరుగులు సాధించిన వారిలో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మిథాలీ రాజ్ కూడా సత్తాచాటింది. 53.50 సగటుతో 107 పరుగులు సాధించింది. కౌర్, మంధానలతో పోలిస్తే ఇవి తక్కువే అయినప్పటికీ ప్రతిసారి జట్టు విజయంలో ఆ పరుగులు కీలకపాత్ర పోషించాయి. బౌలింగ్ విభాగంలో రాధా యాదవ్ 8 వికెట్లతో మెరిసింది.

హర్మన్ ప్రీత్

మహిళా టీ20 ప్రపంచకప్ -2010 (వెస్టిండీస్)

2010 ఎడిషన్​లోనూ టీమిండియా సెమీ ఫైనల్ చేరుకుంది. నెమ్మదైన పిచ్​లపై కెప్టెన్ మిథాలీరాజ్ జట్టును ముందుండి నడిపించింది. మొత్తం 72.50 సగటుతో 145 పరగులు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో నిలిచింది. బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ డయానా డేవిడ్ 9 వికెట్లు సాధించింది. టోర్నీలో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్​గా నిలిచింది.

మిథాలీ రాజ్

మహిళా టీ20 ప్రపంచకప్ -2009 (ఇంగ్లాండ్)

టీ20 మహిళా ప్రపంచకప్​ తొలి ఎడిషన్ ఇది. ఈ టోర్నీలోనూ సెమీ ఫైనల్ చేరుకుంది టీమిండియా. మిథాలీ రాజ్ 91 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్​గా నిలిచింది. లెగ్ స్పిన్నర్ ప్రియాంక రాయ్ 6 వికెట్లతో మెరిసింది.

ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచి తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది ఇండియా.

Last Updated : Mar 6, 2020, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details