భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను తొలిసారి ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుత క్రికెట్‌లో పురుషాధిక్యానికి చెక్ పెడుతూ మేమూ విశ్వవిజేతలుగా నిలవగలం అంటూ సగర్వంగా చాటేందుకు మరో అడుగు మాత్రమే ఉంది. గ్రూప్ స్టేజిలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్లో అదే జోరు చూపించాలని భావిస్తోంది. ఈ పోరు మహిళా దినోత్సవం రోజే జరగడం మరో విశేషం. అయితే ఇప్పుడు ఈ జట్టు ఇలా ఉందంటే అందుకు ఎందరో మహిళా సారథుల కృషి ఉంది. మరి తొలిసారి ఈ టైటిల్ గెలిచి ఈ ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకొంటారో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
1721లో భారత్ తొలి మ్యాచ్ ఆడగా 1848లో 'ఇండియన్ క్రికెట్ క్లబ్' ఏర్పాటు చేశారు. అయితే టీమ్‌ఇండియా ఏర్పడింది మాత్రం 1911లో. 1932లో ఇంగ్లాండ్‌తో భారత్ అధికారిక తొలి టెస్టు ఆడింది. కొద్దికాలం తర్వాతే (1934).. భారత మహిళలు కూడా సుదీర్ఘ ఫార్మాట్ ఆడేశారు. కానీ, పురుషుల క్రికెట్ మాదిరిగా మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం లభించలేదు. ఈ కారణంగా మహిళలకు క్రికెట్ అసోషియేషన్ ఏర్పడటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. 1973లో 'భారత ఉమెన్స్ క్రికెట్ అసోషియేషన్' ఏర్పడింది. భారత మహిళల జట్టు 1976లో వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడింది. శాంతా రంగస్వామి సారథ్యంలో భారత్ తొలి విజయాన్ని అందుకుంది.
కానీ, భారత మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ దక్కలేదు. మ్యాచ్‌లు, పర్యటనలు తక్కువగా ఉండేవి. అయినా జట్టు ప్రదర్శన గొప్పగానే ఉండేది. ఎట్టకేలకు 2006లో భారత ఉమెన్స్ క్రికెట్ అసోషియేషన్‌ను బీసీసీఐ విలీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. మ్యాచ్‌లు, పర్యటనలు పెరిగాయి. ఫలితంగా తమ సత్తా చాటడానికి వారికి అవకాశాలు ఎక్కువగా లభించాయి. అనంతరం ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఆటలో పరిణతి సాధిస్తూ బలమైన జట్టుగా అవతరించింది. దీనిలో డయానా ఎడుల్జి, శాంతా రంగస్వామి, అంజుమ్ చోప్రా, మమతా మబేన్, జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి మేటి సారథుల పాత్ర వెలకట్టలేనిది.
శాంతా రంగస్వామి సారథ్యంలో
శాంతా రంగస్వామి భారత మహిళా క్రికెట్‌కు బలమైన పునాది వేసింది. భారత మహిళా జట్టు తొలి సారథిగా, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులు సృష్టించింది. అంతేకాక మహిళల జట్టుకు తొలి గెలుపు రుచిని అందించింది ఆమె. భారత్ తరఫున ఆమె 16 టెస్టులు, 19 వన్డేలు ఆడింది. టెస్టుల్లో 750 పరుగులు, 21 వికెట్లు, వన్డేల్లో 287 పరుగులు, 12 వికెట్లు తీసింది.
డయాన శకం
1975లో అరంగేట్రం చేసిన డయానా ఎడుల్జి మూడేళ్లకే వన్డే సారథిగా బాధ్యతలు అందుకుంది. 18 వన్డేలు, 4 టెస్టులకు నాయకత్వం వహించింది. వన్డేల్లో 7 విజయాలు సాధించగా, అన్ని టెస్టులు డ్రాగా ముగిశాయి. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కూడా డయానా జట్టుపై ప్రభావం చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. భారత్ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడిన ఆమె.. 615 పరుగులు, 109 వికెట్లు సాధించింది. మొత్తంగా భారత విజయవంతమైన సారథుల్లో ఒకరిగా నిలిచింది. అంతేకాక మహిళల క్రికెట్‌లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది.
అంజుమ్ నాయకత్వంలో