తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జట్టు తుది కూర్పుపై నిర్ణయం తీసుకోలేదు'

ఆసీస్​తో జరగబోయే తొలిటెస్టు తుదిజట్టు ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నాడు టీమ్​ఇండియా టెస్టు వైస్​కెప్టెన్​ అజింక్య రహానె. మరో ప్రాక్టీస్​ సెషన్​ తర్వాత జట్టుకూర్పు గురించి ఆలోచిస్తామని తెలిపాడు.

Will miss Ishant, no decision on combination: Rahane spells very little ahead of 1st Test
'తొలిటెస్టు తుదిజట్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

By

Published : Dec 15, 2020, 8:18 PM IST

ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు తుదిజట్టుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్​ఇండియా టెస్టు జట్టు వైస్​ కెప్టెన్​ అజింక్య రహానె అన్నాడు. మరో ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత జట్టుకూర్పు గురించి ఆలోచిస్తామని తెలిపాడు. డే/నైట్‌ టెస్టులో సంధ్య కాలంలో బ్యాటింగ్‌ చేయడం సవాలని, ఆ సమయంలో బంతి గమనాన్ని పరిశీలిస్తూ ఆడాలని అన్నాడు. ఆసీస్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం తొలి డే/నైట్ టెస్టు ప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో రహానె వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడాడు. మరోవైపు కంగారూల గడ్డపై ఎంతో అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరమవ్వడం గురించి రహానె స్పందించాడు.

"మా వద్ద బలమైన పేస్ దళం ఉంది. అయితే సీనియర్‌ పేసర్‌ ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వడం లోటే. అయినా ఉమేశ్ యాదవ్‌, నవదీప్‌ సైని, సిరాజ్‌, బుమ్రా, షమితో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లు గొప్పగా బౌలింగ్ చేస్తారు. అనుభవం కూడా ఉంది. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా బంతులు వేయాలో వారికి తెలుసు. మేం 20 వికెట్లు సాధిస్తామనే నమ్మకం ఉంది."

- అజింక్య రహానె, టీమ్​ఇండియా టెస్టు వైస్​కెప్టెన్​

టీమిండియా‌ తుదిజట్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఓపెనర్ల స్థానాల్లో గిల్, పృథ్వీ షా, మయాంక్‌తో పాటు కేఎల్ రాహుల్‌ కూడా పోటీపడుతున్నాడు. అలాగే వికెట్‌కీపర్ స్థానం కోసం సాహా, పంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

అయితే తుదిజట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రహానె తెలిపాడు. "తుది జట్టు విషయానికొస్తే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరో ప్రాక్టీస్ సెషన్‌ అనంతరం ముగిసిన తర్వాత కూర్చొని ఓ నిర్ణయానికి వస్తాం. ఎవరు జట్టులోకి వచ్చినా మ్యాచ్‌ను గెలిపించగలరు. మా ఆటగాళ్లందరికీ ఎంతో ప్రతిభ ఉంది. జట్టులో సీనియర్‌ స్పిన్నర్ అశ్విన్‌ కీలకపాత్ర పోషిస్తాడు. బౌలింగ్‌లో వైవిధ్యం చూపించడం సహా బ్యాటుతోనూ రాణిస్తాడు. అయితే కొత్త గులాబి బంతి స్వింగ్ అయినా బ్యాటింగ్‌ చేయగలం. కానీ, సంధ్య కాలంలో పింక్ బాల్‌తో కఠిన సవాలుగా ఉంటుంది. ఆ 40-50 నిమిషాలు ఎంతో ఏకాగ్రతతో ఆడాలి. అప్పుడు బంతి వేగం కూడా పెరుగుతుంది. అదే ఎర్ర బంతి అయితే పేస్‌లో అనూహ్య మార్పులేమి ఉండవు" అని అన్నాడు.

ఆస్ట్రేలియా-ఎ జట్టులో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లతో మంచి ప్రాక్టీస్ దక్కిందని, అలాగే క్వారంటైన్‌లోనూ మంచి సాధన లభించిందని రహానె పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details