తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేశవాళీ క్రికెట్​ను దిగజారుస్తున్నారు: గావస్కర్ - బీసీసీఐపై మండిపడ్డ సునీల్ గావస్కర్

దేశవాళీ క్రికెట్​ను బీసీసీఐ అధికారులు రోజురోజుకూ దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్. ఒకేసారి సీనియర్, యువ ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు పంపడం సరికాదని తెలిపాడు.

Sunil Gavaskar
సన్నీ

By

Published : Jan 27, 2020, 4:43 PM IST

Updated : Feb 28, 2020, 4:00 AM IST

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ స్థాయిని బీసీసీఐ అధికారులు రోజురోజుకు దిగజారుస్తున్నారని మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. భారత్‌-ఎ జట్టు పేరుతో అగ్రశ్రేణి ఆటగాళ్లను రంజీ ట్రోఫీకి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"కొన్నేళ్లుగా ఆటగాళ్లు ఎక్కువ క్రికెట్‌ ఆడుతూ అలిసిపోతున్నారని మనం వింటున్నాం. కానీ ఐపీఎల్‌ సమయంలో వారికి అలసట అనేది ఉండదు. ఇలా చేస్తూ రంజీ ట్రోఫీ స్థాయిని తగ్గిస్తున్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ఉంది కాబట్టి కోహ్లీసేన న్యూజిలాండ్‌కు వెళ్లింది. కానీ భారత్-ఎ జట్టు కూడా అదే సమయంలో కివీస్‌కు వెళ్లడానికి కారణాలేంటి? అలా వెళ్లడం వల్ల కీలక ఆటగాళ్లను కోల్పోయి రంజీ ట్రోఫీ కళ తప్పుతోంది. అండర్‌-19 ప్రపంచకప్‌కు కూడా యువకులు దక్షిణాఫ్రికా వెళ్లడం వల్ల నాకౌట్‌లో కొన్ని జట్లు బలహీనంగా మారుతున్నాయి."
-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ క్రికెటర్

ఒకేసారి సీనియర్ జట్టును, యువ ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు పంపడం సరికాదని అన్నాడు గావస్కర్. ఇతర దేశాలు ఇలా చేయడం లేదని చెప్పాడు.

"సీనియర్‌ జట్టులో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భారత్‌-ఎ జట్టు కివీస్‌ పర్యటనలో ఉందనే వాదన సరైనది కాదు. ఇతర దేశాలు ఇలా చేయడం లేదు. తమ దేశవాళీ సీజన్‌ సమయంలో ఏ జట్టు కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు. ఐపీఎల్‌ జరిగే సమయంలో 'ఎ' జట్టు పర్యటనలు, అండర్-19 సిరీస్‌లు ఏర్పాటు చేస్తారా? పాఠశాల, కళాశాల, జూనియర్‌ క్రికెట్‌, కార్పొరేట్‌ క్రికెట్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ను కలిపి భారత క్రికెట్‌ అంటారు. వీటికీ అభిమానులు, మీడియా, స్పాన్సర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఇలా ఉందంటే దానికి ఇవన్నీ కారణమే."
-సునీల్ గావస్కర్‌, టీమిండియా మాజీ క్రికెటర్

ప్రస్తుతం కోహ్లీసేనతో పాటు భారత్-ఎ జట్టు కూడా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ముగిసిన రెండు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇవీ చూడండి.. బుమ్రాపై కివీస్ ఓపెనర్ గప్తిల్ ప్రశంసలు

Last Updated : Feb 28, 2020, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details