తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో 'లెగ్'​ అస్త్రం.. వేగం కన్నా వికెటే మిన్న - leg Spin Bowling

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్​ను శాసిస్తోన్న అస్త్రం 'లెగ్​స్పిన్'. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, దక్షిణాఫ్రికా వంటి దేశాలూ స్పిన్​పైనే ఇటీవల కాలంలో ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. పేస్​ బౌలింగ్​కు కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​ అవసరం. వేగానికి తగ్గ స్వింగ్​ చేయలేకపోతే పరుగుల వరద తప్పదు. ఇలాంటి సమయంలో మిడిల్ ఓవర్లలో రాణించేందుకు స్పిన్​ ఓ అస్త్రం. అందుకే కోహ్లీ, విలియమ్సన్​ వంటి ప్రపంచ స్థాయి సారథులు​ పవర్​ ప్లే వంటి కీలక సమయంలోనూ ఈ విభాగాన్ని ప్రయోగించి ఫలితం పొందుతున్నారు. ఇది భారత అమ్ముల పొదిలో భవిష్యత్తు క్షిపణిగా మారనుందా.? మరి రాణిస్తున్న ఆ యువతారలెవరు.? అనే దానిపై ఓలుక్కేద్దాం.

Poonam Yadav, ravi bishnoi
క్రికెట్​పై శాసిస్తోన్న 'లెగ్'​ అస్త్రం.. వేగం కన్నా వికెటే మిన్న

By

Published : Feb 26, 2020, 2:17 PM IST

Updated : Mar 2, 2020, 3:24 PM IST

ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్​ సామర్థ్యం ఉన్న దేశాలన్నీ తమ బౌలింగ్​ విభాగంలో స్పిన్​ను భాగం చేసుకున్నాయి. ఎందుకంటే పేస్​తో పాటు వైవిధ్యమైన బంతులు వేయగలిగే సత్తా స్పిన్నర్లకే ఉంటుంది. తక్కువ సమయంలో ఓవర్​ పూర్తి చేయడం, తక్కువ వేగంతో వేసిన బంతులతో ఎక్కువ వికెట్లు తీయడం ఈ బౌలర్ల వల్లే అవుతుంది. అందుకే భారత్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ వంటి దేశాలు వీరిపైనే ఎక్కువ ఆధారపడతాయి. మెరుగైన ఫలితాలూ అందుకుంటున్నాయి.

ఇందులో లెగ్​ స్పిన్​ మరింత కీలకంగా మారుతోంది. గతంలో భారత్​ నుంచి అనిల్​ కుంబ్లే, ఆస్ట్రేలియా నుంచి షేన్​ వార్న్​, పాక్​ నుంచి షాహిద్​ అఫ్రిది వంటి క్రికెటర్లు పునాదులు వేస్తే.. ఇప్పుడు వాటిపైనే లెగ్​ అస్త్రంతో ఔరా అనిపిస్తున్నారు పలువురు క్రికెటర్లు.

యువ భారత్ జట్ల​ నుంచి ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచిన ఇద్దరు బౌలర్లూ లెగ్​స్పిన్నర్లే కావడం విశేషం. వాళ్లే ఇటీవల అండర్​ 19 పురుషుల ప్రపంచకప్​లో సత్తా చాటిన రవి బిష్ణోయ్​. ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచకప్​లో సంచలనంగా మారిన పూనమ్​ యాదవ్​.

రవి బిష్ణోయ్​...

టీమిండియా అండర్​-19 జట్టు ఫైనల్​కు చేరడంలో బంతితో కీలకపాత్ర పోషించాడు. ఈ మెగాటోర్నీలో గింగిరాలు తిరిగే బంతులతో మూడుసార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. సెమీఫైనల్లో తక్కువ పరుగుల లక్ష్యాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. విజయపు అంచుల వరకు జట్టును తీసుకొచ్చాడు.

రవి బిష్ణోయ్​

రాజస్థాన్​కు చెందిన ఈ లెగ్​ స్పిన్నర్​​.. టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవార్డునూ అందుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా మధ్య ఓవర్లలోనూ ప్రత్యర్థులను కట్టడి చేశాడు. ఈ ప్రపంచకప్​లో 6 ఇన్నింగ్స్​ల్లో 52 ఓవర్లు విసిరి 6 మెయిడిన్​ చేశాడు. 10.64 సగటు, 3.48 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. 181 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి గణాంకాలు టోర్నీలో ఎవ్వరికీ లేకపోవడం విశేషం.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో బిష్ణోయ్​ ఆడనున్నాడు. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ తరఫున ఈ యువ క్రికెటర్​ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ జట్టు కోచ్​ కుంబ్లే ఇతడి టాలెంట్​ చూసి ప్రత్యేకంగా వేలంలో ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు.

పూనమ్​ యాదవ్​...

తక్కువ రనప్‌తో బంతిని గాల్లోకి వదలడం.. అది అలా తేలుతూ వచ్చి ఎక్కడో పడి ఇంకెక్కడికో తిరగడం. తేరుకునే లోపే బౌల్డో, స్టంపౌటో అయిపోవడం. ఏం మాయ చేస్తుందో ఏమో కానీ చూడ్డానికి చాలా తేలిగ్గా అనిపించే బౌలింగ్‌ అది. ఏముందా బౌలింగ్‌లో గల్లీ క్రికెట్లోనూ బాదేస్తారు అనుకుంటారు. కానీ మైదానంలో దిగి ఆడేవాళ్లకే తెలుస్తుంది ఆ మాయావి తడాఖా. ఆమె పూనమ్‌ యాదవ్‌. ప్రస్తుతం మహిళా టీ20 ప్రపంచకప్‌ అంతా ఈ అమ్మాయి చుట్టే తిరుగుతోంది. సంప్రదాయ లెగ్‌ స్పిన్‌ కళకు మళ్లీ వన్నె తెస్తున్న పూనమ్‌ ప్రత్యేకత ఏంటి..? ఆమెకు బ్యాటర్లు ఎందుకు దాసోహం అవుతున్నారు.

పూనమ్​ యాదవ్

>> ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ చూసినవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది పూనమ్‌ బౌలింగ్‌ ఏంటో! ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాటర్లుగా పేరొందిన వాళ్లకే ఆమె చెమటలు పట్టించింది. తర్వాత బంగ్లా అమ్మాయిలూ ఆమె మాయలో చిక్కుకున్నారు. బక్క పలచని శరీరం.. ఎత్తు 5 అడుగులే! పూనమ్‌ను చూస్తే ప్రమాదకర బౌలర్‌ అని ఎవరూ అనుకోరు. కానీ ఆమె బంతిని స్పిన్‌ చేసే తీరే అందరిలోనూ భిన్నంగా నిలబెడుతుంది. ఆకారం చిన్నదైనప్పటికీ.. ఈ ఆగ్రా బౌలర్‌ దాన్నే బలంగా మలుచుకుంది. బంతిని నెమ్మదిగా రిలీజ్‌ చేస్తూ బ్యాటర్లకు ఒక రకమైన గందరగోళ స్థితిని సృష్టిస్తోంది.

>> తక్కువ రనప్‌తో.. బంతిని ఎక్కువసేపు గాల్లో ఫ్లయిట్‌ చేస్తూ ఇబ్బంది పెడుతోంది. బంతి పడ్డాక కొడదాం అనుకుంటే ఎటు తిరుగుతుందో తెలియదు. పోనీ క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడదామంటే బంతి దొరక్క స్టంపౌటవ్వాల్సిందే. పూనమ్‌ అమ్ములపొదిలో రాంగ్‌ఆన్‌, ఫ్లిప్పర్‌, టాప్‌స్పిన్‌ లాంటి ఎన్నో పదునైన అస్త్రాలు ఉన్నాయి. బ్యాటర్ల కదలికలను బట్టి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తుందామె. అలా గాల్లో తేలుతూ బంతులు వేసినా.. ఎక్కడ పడాలో, ఎలా పడాలో, ఎలా తిరగాలో అన్న విషయంలో పూనమ్‌కు స్పష్టత ఉంది. ఈ లక్షణాలతోనే ఆమె ప్రత్యర్థి బ్యాటర్లకు కొరుకుడు పడని బౌలర్‌గా ఎదిగింది.

ఈ యువ క్రికెటర్లే కాకుండా ప్రస్తుతం ఆయా దేశాల్లో లెగ్​ స్పిన్​తో పేరు తెచ్చుకొని జట్టుకు కీలకంగా మారిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. భారత్​లో చాహల్​, ఇంగ్లాండ్​లో అదిల్​ రషీద్​, ఆస్ట్రేలియాలో ఆడమ్​ జంపా, అఫ్ఘానిస్థాన్​లో రషీద్​ ఖాన్​, పాకిస్థాన్​లో షాదాబ్​ ఖాన్, దక్షిణాఫ్రికాలో ఇమ్రాన్​ తాహిర్​ వంటి స్టార్​ బౌలర్లు లెగ్​స్పిన్నర్లే. వీళ్లంతా పేసర్ల కంటే జట్టులో అత్యుత్తమంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

చాహల్​, అదిల్​ రషీద్​, రషీద్​ ఖాన్​, ఆడమ్​ జంపా, షాదాబ్​ ఖాన్​, ఇమ్రాన్​ తాహిర్​
Last Updated : Mar 2, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details