ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా రోహిత్ శర్మ ఎదగడానికి గల కారణం ధోనీనే అని చెప్పాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న ఇతడు.. ఓ టీవీ ఛానెల్ లైవ్‌చాట్‌లో మాట్లాడతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
'రోహిత్ శర్మ ఇలా ఉండటానికి ధోనీనే కారణం' - రోహిత్ శర్మ తాజా వార్తలు
రోహిత్.. స్టార్ బ్యాట్స్‌మన్‌గా మారడం వెనుక ధోనీ మద్దతు ఉందని చెప్పాడు మాజీ ఆటగాడు గంభీర్. ప్రస్తుతం యువఆటగాళ్లకు, సారథి కోహ్లీ నుంచి అలాంటి అండే కావాలని అభిప్రాయపడ్డాడు.
"సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ ఓ క్రికెటర్‌కు మద్దతుగా నిలిచినా, కెప్టెన్ అండ లేకపోతే అవన్నీ నిరూపయోగమే. అంతా సారథి చేతుల్లోనే ఉంటుంది. రోహిత్ శర్మకు ధోనీ చాలాకాలం మద్దతుగా నిలిచాడు. మరే ఇతర ఆటగాడికి ఇలా జరుగుండకపోవచ్చు. ప్రస్తుతం యువ ఆటగాళ్లయిన శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్‌లకు కెప్టెన్ కోహ్లీ అండగా నిలిచి, అవకాశాలివ్వాలి" -గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్
2007లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకు కొన్నేళ్లపాటు సరైన గుర్తింపు దక్కలేదు. అయితే 2013లో, ధోనీ సూచనతో రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశమిచ్చింది మేనేజ్మెంట్. అప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఇప్పటివరకు వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసి, ఎవరికీ సాధ్యం కానీ రికార్డును నెలకొల్పాడు.