వీరేందర్ సెహ్వాగ్.. టీమిండియా ఓపెనింగ్ స్థానానికి వన్నె తెచ్చిన బ్యాట్స్‌మన్. ముల్తాన్‌లో పాకిస్థాన్ బౌలర్లకు దడపుట్టించినా, చెన్నైలో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించినా అతడికే చెల్లింది. భారత జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడమే కాక రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ ఇతడే కావడం విశేషం. అయితే ఈ రెండు ట్రిపుల్ శతకాలు సరిగ్గా నాలుగేళ్ల వ్యవధిలో ఒకే రోజు నమోదయ్యాయి. అదీ ఈ రోజే. ఐదు రోజుల క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 72 ఏళ్ల తర్వాత భారత్ తరఫున త్రిశతకం చేసిన తొలి బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్. ఈ సందర్భంగా నాటి విశేషాలు
ముల్తాన్ కా సుల్తాన్
2004 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ముల్తాన్‌లో తొలి టెస్టు. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 356/2తో నిలిచింది. సెహ్వాగ్(228), సచిన్(60) క్రీజులో ఉన్నారు. ఆరోజు సెహ్వాగ్ చేసిన పరుగులే పాకిస్థాన్ గడ్డపై ఓ భారత బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక వ్యక్తగత స్కోరు. సంజయ్ మంజ్రేకర్ 1989లో లాహోర్ టెస్టులో 218 పరుగులు చేశాడు. రెండో రోజు(మార్చి 29) సెహ్వాగ్ మరో 81 పరుగులు సాధించి కెరీర్‌లో తొలిసారి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 309 పరుగుల వద్ద మహ్మద్ సామీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సచిన్ (194 నాటౌట్) మరోవైపు అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా.
సరిగ్గా నాలుగేళ్లకు దక్షిణాఫ్రికాపై
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత సెహ్వాగ్ మరోసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. 2008లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో చెన్నైలో తొలి టెస్టు. మూడో రోజు (మార్చి 28) సెహ్వాగ్ (309) రెండోసారి ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఈ ఫార్మాట్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరును తానే అధిగమించాడు. మరుసటి రోజు(మార్చి 29) మరో పది పరుగులు చేసిన సెహ్వాగ్.. 319 పరుగుల వద్ద ఎన్తిని బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీమిండియా ఓపెనర్ నాలుగేళ్ల వ్యవధిలో ఒకేరోజు రెండుసార్లు టెస్టుల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేశాడు. మొత్తంగా ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేసింది నలుగురే. బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా), బ్రియన్ లారా (వెస్టిండీస్), వీరేందర్ సెహ్వాగ్ (భారత్), క్రిస్‌గేల్ (వెస్టిండీస్).