తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19​: భారత క్రికెట్​ రూపు మార్చిన కపిల్ సేన

1983లో కపిల్ సారథ్యంలోని టీమిండియా మొదటిసారి ప్రపంచకప్ గెలిచింది. ఫైనల్లో వెస్టిండీస్​ను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత భారత్​లో క్రికెట్​ ముఖచిత్రమే మారిపోయింది.

By

Published : May 14, 2019, 10:23 AM IST

Updated : May 14, 2019, 11:55 AM IST

కపిల్ దేవ్

భారత క్రికెట్​లో మరుపురాని రోజుగా గుర్తుండేది 1983 ప్రపంచకప్ ఫైనల్. ఆ రోజు కపిల్​సేన భీకర వెస్టిండీస్ జట్టుపై గెలిచి మొదటిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అండర్​డాగ్స్​గా బరిలోకి దిగిన భారత్ ట్రోఫీ గెలవడం అసాధ్యమే అయినా... టీమిండియా సాధ్యం చేసి భారత్​లో క్రికెట్​కు ఆదరణ పెరగడానికి కారణమైంది.

1983 ప్రపంచకప్​కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. జూన్ 9న ప్రారంభమైన టోర్నీ 25న జరిగిన ఫైనల్​​తో ముగిసింది. ఆ కాలంలో వరల్డ్​కప్​ను ప్రుడెన్షియల్ కప్ అనేవారు. ప్రుడెన్షియల్ ఇన్సురెన్స్ లిమిటెడ్ ఆ టోర్నీకీ ప్రచారకర్తగా ఉండటమే అందుకు కారణం. తర్వాత రోజుల్లో ప్రపంచకప్​గా రూపాంతరం చెందింది.
మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా ఆడాయి. పూల్ ఏ లో ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక ఉండగా.. పూల్ బీ లో భారత్​తో పాటు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, జింబాబ్వే ఉన్నాయి. పూల్​లో ఉన్న జట్లతో ప్రతి టీమ్​ రెండు సార్లు తలపడింది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్​కు అర్హత సాధిస్తాయి.

ప్రపంచకప్​ భారత జట్టు

కపిల్ 175
గ్రూప్ దశలో హైలైట్​గా చెప్పుకోదగ్గది జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్. ఓ దశలో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత్. 78 పరుగులకు 7 వికెట్లు నష్టపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్​ ఆడాడు కపిల్. ఈ మ్యాచ్​లో జింబాబ్వేపై విజయం సాధించి గ్రూప్ దశను ముగించి సెమీస్ చేరింది టీమిండియా.

ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ కూడా సెమీస్​కు అర్హత సాధించాయి.సెమీస్​లో భారత్.. ఇంగ్లండ్ జట్టును ఓడించగా, వెస్టిండీస్.. పాక్​పై గెలిచి ఫైనల్ చేరింది.
పైనల్లో అప్పటివరకు వరుసగా 2 సార్లు ప్రపంచకప్​ గెలిచిన జట్టు ఓ వైపు.. అసలు గెలుస్తుందన్న నమ్మకం లేకుండా బరిలోకి దిగిన జట్టు మరోవైపు. అందరూ వెస్టిండీస్ ప్రపంచకప్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనుకున్న దశలో మేటి జట్టును మట్టికరిపించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది కపిల్ సేన. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకే ఆలౌటైంది. అయినా ఆత్మవిశ్వాసంతో ఆడి.... విండీస్​ను 140 పరుగులకే కట్టడి చేసింది. ప్రపంచకప్ గెలిచింది.

ప్రపంచకప్ అన్ని జట్లు

ఫైనల్లో ఆ క్యాచ్​
జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగుల ఇన్నింగ్స్​ ప్రపంచకప్​లో హైలైట్​గా నిలిస్తే.. మరో చెప్పుకోదగ్గ అంశం ఫైనల్​లో కపిల్ పట్టిన ఓ క్యాచ్. ఛేదనలో విండీస్‌ 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అప్పుడే మైదానంలోకి అడుగుపెట్టాడు వివియన్ రిచర్డ్స్‌. చూస్తుండగానే ఏడు బౌండరీలు బాదేశాడు. 30ల్లోకి వచ్చేశాడు. స్కోరు 50 దాటేసింది. అప్పుడే మదన్‌ లాల్‌ ఆఫ్‌ సైడ్‌ ఆవల ఒక షార్ట్‌ పిచ్‌ బంతి సంధించాడు. బంతిని హుక్​ షాట్ ఆడగా ఎడ్జ్‌ తీసుకుని మిడ్‌వికెట్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డర్‌ లేడు. షార్ట్‌ మిడ్‌వికెట్‌లో ఉన్న కపిల్‌ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చాడు. బంతి పడే చోటుకు చేరుకుని ఒడిసి పట్టుకున్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో అంత ఒత్తిడిలో ఆ క్యాచ్‌ను కపిల్‌ అందుకున్న తీరు అమోఘం. ఆ తర్వాత 83 పరుగుల తేడాలో 8 వికెట్లు తీసి ప్రత్యర్థిని 140కే చుట్టేశారు భారత బౌలర్లు. భీకరమైన విండీస్‌పై అద్భుత విజయంతో ప్రపంచకప్‌ను ఎగరేసుకువచ్చింది కపిల్‌ సేన.

Last Updated : May 14, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details