తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ, రవిశాస్త్రి మధ్య విభేదాలు నిజమేనా..? - sourav ganguly latest news

బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ దాదాపు ఖరారైన నేపథ్యంలో మరో విషయం నెట్టింట వైరల్​గా మారింది. టీమిండియా ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి, దాదా మధ్య గతంలో విభేదాలు మళ్లీ తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.

గంగూలీ, రవిశాస్తి మధ్య విభేదాలు నిజమేనా..?

By

Published : Oct 15, 2019, 4:17 PM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి రేసులో ఏకగ్రీవంగా కొనసాగుతున్నాడు టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ. అతడి నియామకం లాంఛనమని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చను తెరపైకి తీసుకొచ్చారు నెటిజన్లు.

టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, గంగూలీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. తనకు టీమిండియా కోచ్‌ పదవి రాకుండా దాదా అడ్డుపడ్డాడని గతంలో విమర్శలు చేశాడు రవిశాస్త్రి. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

విమర్శల పర్వం...

2016లో టీమిండియా కోచ్​ను​ ఎంపిక చేసింది సచిన్‌ తెందూల్కర్‌, సౌరభ్​ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ). ఇందులో భాగంగా రవిశాస్త్రి స్కైప్​ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. రవిశాస్త్రిని ఎంపిక చేయాలని లక్ష్మణ్​, సచిన్​ అనుకున్నా... గంగూలీ మాత్రం అడ్డుకున్నాడు. కోచ్ పదవి చాలా ఉన్నతమైన హోదాగా పేర్కొంటూ... కనీసం ఇంటర్వ్యూకు వచ్చే తీరిక లేని వ్యక్తిని ఎందుకు ఎంపిక చేయాలనే వాదన వినిపించాడు గంగూలీ.

రవిశాస్త్రి బదులుగా అనీల్‌ కుంబ్లేను కోచ్‌గా ఎంపిక​​ చేయాలని దాదా పట్టుబట్టాడు. ఇతర కమిటీ సభ్యులనూ ఒప్పించాడు. తనకు కోచ్‌ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి బహిరంగంగా ఎన్నోసార్లు విమర్శించాడు. అయితే కుంబ్లే రాజీనామా అనంతరం రవిశాస్త్రినే తిరిగి కోచ్‌గా ఎంపిక చేసింది సీఏసీ. ఆ సమయంలో కూడా రవిశాస్త్రి ఎంపిక పట్ల గంగూలీ ఆసక్తి చూపలేదు. ఇటీవల కపిల్​దేవ్​ నేతృత్వంలోని కమిటీ రవినే రెండోసారి కోచ్​గానూ ఎంపిక చేసింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా ఎన్నికైతే ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతాయో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details