ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో తాను సెంచరీ చేసినప్పుడు చెన్నై అభిమానులు ఉత్సాహాపరిచారని అంటున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే, హీరో అజిత్ నటిస్తున్న 'వాలిమై' అప్‌డేట్ గురించి తనతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీని ప్రేక్షకులు అడిగారని తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు.
"తమిళ ప్రజలకు సినిమాలంటే అంతలా ఇష్టమని నాకు తెలియదు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్.. అశ్విన్.. అని పిలిచారు. దానికి బదులుగా వెనక్కి తిరిగితే.. 'వాలిమై' సినిమా అప్‌డేట్ ఏంటి అని ఓ అభిమాని అడిగాడు. తర్వాత రోజు గూగుల్‌లో దాని గురించి తెలుసుకున్నా. అయితే మొయిన్ అలీ కూడా నా దగ్గరకు వచ్చి వాలిమై అంటే ఏంటని అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది. అలీని కూడా వాళ్లు అడిగారని. అయితే ఆ సినిమా గురించి ఇంగ్లాండ్ ఆటగాడిని అడగటమే చాలా ఫన్నీగా అనిపించింది."