టీమ్‌ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్ హాగ్. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆటకు సంబంధించిన అనేక విషయాలపై స్పందించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఒకరు రైనా గురించి ప్రశ్నించగా అతడిలా అన్నాడు.
"టీమ్‌ఇండియాలో ప్రస్తుత పరిస్థితుల్లో సారథి విరాట్ కోహ్లీ యువకులపైనే ఆసక్తి చూపుతున్నాడు, రైనా ఆడే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే మంచి ప్రదర్శన చేశాడు. అంతకన్నా కింద స్థాయిలో రైనా ఆడటం చూడలేను. అతడు 3,4 స్థానాల్లో సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్. ఇకపై టీమ్‌ఇండియాలో అతడిని చూడలేం. టీ20ల్లో శిఖర్ ధావన్‌ను వదిలేసి రాహుల్, రోహిత్‌తో ఓపెనింగ్ చేయనిస్తే అప్పుడు మాత్రం చిన్న అవకాశం ఉంటుంది."