ఆస్ట్రేలియా కవ్వింపులకు సిద్ధంగా ఉన్నామని, ప్రత్యర్థులు సంధించే బౌన్సర్లకు సమాధానాలు ఉన్నాయని టీమ్ఇండియా యువఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన డే/నైట్ సన్నాహక మ్యాచ్‌లో 43, 65 పరుగులతో గిల్ ఆకట్టుకున్నాడు. దీంతో తుదిజట్టులో అతడి స్థానం ఖరారైనట్లే అని భావిస్తున్నారంతా. అయితే కంగారూల గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం అంత తేలికైనా విషయం కాదని గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక వైబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా తరఫున ఆడాడు.
"ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భయపడే విషయమే. అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నా. బ్యాట్స్‌మెన్‌కు తనపై తనకు విశ్వాసం మరింత పెరగాలంటే కంగారూల గడ్డపై రాణించడం కంటే మరో గొప్ప విషయం ఉండదు. అయితే ఒకప్పుడు భారత ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉండేవారు కాదని అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని మారిపోయాయి. కొందరు కవ్వింపులకు సమాధానం ఇవ్వరు. మరికొందరు దీటుగా బదులిస్తుంటారు. నా వరకు నేను అంత నెమ్మదస్తుడిని కాదు. అలా అని ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరించే వ్కక్తిత్వం కాదు" అని గిల్ అన్నాడు.