ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో సునాయసంగా విజయం సాధించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కోహ్లీ సేన 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వికెట్లు తీసిన నవదీప్ సైని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ (24), విరాట్ కోహ్లీ(19), మనీష్ పాండే(19) రాణించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, సునీల్ నరైన్ తలో 2 వికెట్లు తీసుకున్నారు.
బౌలర్లే మార్చేశారు..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన... ఆరంభం నుంచే విండీస్ ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చింది. తొలి ఓవర్ నుంచే బౌలర్లు విజృంభించారు.
విండీస్ బ్యాట్స్మెన్లలో పొలార్డ్ 49 పరుగులు( 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్ వరకు పోరాడాడు. మరో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ 20 పరుగులు( 16 బంతుల్లో 1ఫోరు, 2సిక్సర్లు) మాత్రమే రాణించాడు. ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్ అయ్యారు. మిగతావారు రెండంకెల స్కోరు చేయలేదు. ఫలితంగా వెస్టిండీస్ 95 పరుగులకే పరిమితమైంది.
నవదీప్ సైని అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.