సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనలో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడని వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా అభిప్రాయపడ్డాడు. తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ క్రికెటర్ ఈ యువ బ్యాట్స్‌మన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడో క్లాస్ ప్లేయర్ అని, ఆటగాళ్ల ఎంపికలో తాను పరుగులు మాత్రమే చూడనని చెప్పాడు. వాళ్ల నైపుణ్యాలు, ఒత్తిడిలో రాణించే సత్తా, బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే స్థానాలను బట్టి ఆటగాళ్లను అంచనా వేస్తానన్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నాడు.
"రోహిత్, డికాక్ తర్వాత సూర్య మూడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేస్తాడు. మూడో స్థానమంటే ఎంతో కీలకం. ఏ జట్టులోనైనా ఆ స్థానంలో ఆడే ఆటగాడు ఎంతో ప్రతిభగల సమర్థుడు. సూర్య కూడా అలాంటి వాడే. ఎంతో నమ్మకమైన ఆటగాడు. ఇక ముంబయి జట్టులో ఆ స్థానానికి అతడు సరైన బ్యాట్స్‌మన్. ఆస్ట్రేలియా పర్యటనకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో ఏ కారణాలు కనిపించడం లేదు."